డిల్లీలో కీచకుల చేతిలో చిక్కి అత్యంత పాశవికంగా అత్యాచారం చేయబడిన నిర్భయ గురించి మనందరికి తెలుసు. తాను సమిధిగా మారి దేశంలోని మహిళల కోసం నిర్భయ చట్టాన్ని అందించిన గొప్ప యువతి. ఈమెపై జరిగిన దారుణంపై ప్రతి ఒక్కరు స్పందించి దేశం మొత్తంలో నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అలాంటి ఈ మహిళకు జన్మనిచ్చిన తల్లిని మహిళా దినోత్సవం రోజే ఓ కర్ణాటక మాజీ డిజిపి ఒకరు అవమానించారు. 

మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరులో  ఓ సంస్థ కొందరు విశేష సేవలందించిన మహిళలకు సత్కరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నిర్భయ తల్లి ఆశాదేవిని కూడా పిలిచి సన్మానించారు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్ణాటక మాజీ డిజిపి సంగ్లియానా మాట్లాడుతూ... నిర్భయ తల్లిపై అవమానించారు.  ఈవిడే(నిర్భయ తల్లి) ఇంత అందంగా ఉంటే ఈమె కూతురు నిర్భయ ఇంకెంత అందంగా ఉండేదో ఊహించుకొండి అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆశా దేవి శరీరాకృతి చాలా బావుందంటూ అసభ్యంగా మాట్లాడారు. అంతే కాకుండా మహిళలు శక్తివంతులే అయినప్పటికి వారు తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే రేపిస్టులకు లొంగిపోవాలంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు కర్ణాటక లోనే కాదు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. గొప్ప విద్యావంతుడైన సంగ్లియానా మతిలేనివాడిలాగా మాట్లాడారంటూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఓ మహిళ గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన ఆయన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నట్లు మహిళలు తెలిపారు.