కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(83) బుధవారం తెల్లవారు జామున పరమపదించారు. శ్వాస సంబంధిత సమస్యతో మంగళవారం రాత్రి ఏబిసిడి ఆసుపత్రిలో చేరిన స్వామీజీ ఈరోజు తెల్లవారుజామును తుది శ్వాస విడిచారు. కంచి పీఠానికి జయేంద్ర సరస్వతి 69వ పీఠాధిపతి. 1954లో జయేంద్రగా మారిన సుబ్రహ్మణ్యఅయ్యర్ కంచిమఠానికి 1954లో జూనియర్ స్వామిగా నియమితులయ్యారు. తర్వాత 1994లో పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. 1935 జూలై 18న తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో జన్మించారు. జయేంద్ర అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్.

కంచిమఠాన్ని ప్రపంచంలోని హిందువులకు చేరువ చేయటంలో జయేంద్ర తీవ్ర కృషి చేశారు. హిందుధర్మాన్ని వ్యాప్తి చేయటంలో జయేంద్ర దేశవ్యాప్తంగా సంవత్సరాల తరబడి పర్యటనలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కంచి మఠానికి అనుగుణంగా ఎన్నో విద్యాసంస్ధలను కూడా నెలకొల్పారు. మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, హిందు ధర్మాలను బోధించటం, విశ్వవ్యాప్తం చేయటానికి అవసరమైన విద్యాసంస్ధలను కూడా నెలకొల్పారు. కంచి నేత్రాలయ పేదలకు ఎంతో సేవ చేస్తోంది.

మఠం పీఠాధిపతిగా బాగా ఒత్తిడికి లోనవ్వటంతోనే జయేంద్ర ఆరోగ్యం దెబ్బతిన్నది. దాదాపు పదేళ్ళుగా స్వామీజీ ఏదో ఒక అనారోగ్యంతో పలుమార్లు ఆసుపత్రిలో చేరుతూనే ఉన్నారు. కంచిమఠానికి తెలుగురాష్ట్రాలతో విడదీయరాని సంబంధాలున్నాయి. ప్రత్యేకించి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధికెక్కిన తిరుములకు జయేంద్ర తరచూ వస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నడిచే ప్రతీ దేవాలయం కంచిమఠం అనుసరించే ఆగమ శాస్త్రాల పద్దతులనే అనుసరిస్తాయి.

హిందుదర్మ వ్యాప్తి, సేవా కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే జయేంద్ర వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. మఠంలో మేనేజర్ గా పనిచేసిన శంకర్రామన్ హత్య కేసులో నిందుతునిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సంచలనం సృష్టించిన శంకర్రామన్ హత్యకేసులో కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారు. తర్వాత నిర్దోషిగా బయటపడ్డారనుకోండి అదివేరే సంగతి. తదుపరి పీఠాదిపతిగా దాదాపు 2 దశాబ్దాల క్రితమే శంకర విజయేంద్రసరస్వతిని జయేంద్ర నియమించారు.