హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీదొంగలు రెచ్చిపోయారు. బంగారు నగల దుకాణంలోకి చొరబడిన దుండగులు సిబ్బందిని కట్టేసి దాదాపు 5 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన పాతబస్తీలోని మూసాబౌలిలో చోటుచేసుకుంది. ఈ దొంగతనంలో ఆధారాలు దొరక్కుండా సిసి కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనానికి సంబందించి దుకాణం సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

ఇవాళ మద్యాహ్నం ఇంచుమించు 12.30 గంటల సమయంలో పాతభస్తీలోని ఓ నగల దుకాణంలోకి 10-12 మంది దొంగలు మారణాయుధాలతో చొరబడ్డారు. అక్కడున్న సిబ్బందిని కత్తులతో బెదిరించి కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం దుకాణంలోని దాదాపు 5కిలోల బంగారాన్ని దోచుకున్నారు. వెళుతూ వెళుతూ ఆదారాలు లేకుండా సిసి కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారు. 

ఈ దొంగతనంపై సమాచారం తెలుసుకున్న డిసిపి సత్యనారాయణ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ దొంగతనం సమయంలో షాప్ లో వున్న 21మంది సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. జువెల్లరీ సమీపంలోని సిసి కెమెరాలను పరిశీలించారు.  ఈ కేసును  ఛాలెంజింగ్‌గా తీసుకున్నామని, సాధ్యమైనంత త్వరగా ఛేదిస్తామని డిసిపి తెలిపారు.