జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ క్రేజ్ ను అడ్డు పెట్టుకుని మహిళల్ని మోసం చేస్తున్న కొందరు జనసేన నాయకుల బండారం ఏలూరులో బైటపడింది. పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా కలుసుకునే ఏర్పాటు చేస్తానంటూ సామాజిక మాద్యమాల ద్వారా అభిమానులను, ముఖ్యంగా మహిళలను ఈ నిందితులు నమ్మబలికేవారు. వారితో కాస్త నమ్మకం పెరిగాక రెచ్చిపోయి డబ్బు, నగలు కాజేయడం ప్రవృత్తిగా మార్చుకున్నారు.  

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు జనసేన పార్టీ నాయకులుగా తమను తాము పేర్కొంటూ దత్తి బాలాజీ, బాలు, దేవేంద్రలు ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. ఈజీ మనీ సంపాదించడానికి జనసేనాని పవన్ పై జనాల్లో వున్న అభిమానాన్ని వాడుకోవాలని ప్లాన్ చేశారు.  పవన్ అంటే అభిమానమున్న ధనవంతుల కుమార్తెలను వీరు టార్గెట్ చేసేవారు. ఫేస్ బుక్ లో చాటింగ్ చేయడం పరిచయం పెంచుకోవడం వంటివి చేసేవారు. పవన్ తో కలిసి ఫొటోలు దిగే చాన్స్ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బు - నగలు గుంజేవారు.  ఇలా కుదరక పోతే  మహిళలతో  సాన్నిహిత్యం పెంచుకుని వారి పర్సనల్ విషయాలు తెలుసుకునేవారు. ఆ తర్వాత వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. 

ఇలాగే  ఓ స్థానిక నగల వ్యాపారి కూతురిని నమ్మించి 3 కిలోల బంగారు ఆభరణాలు కాజేశారు. అయితే ఈ యువతి  ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి గుట్టు బైటపడింది. ఈ ఫిర్యాదుతో ఏలూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. తమ సొంత అవసరాల కోసమే పవన్ కళ్యాణ్ అభిమానుల్ని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించినట్లు సమాచారం.