తండ్రి బాటలో భారీ పాదయాత్రకు రూపకల్పన చేశారు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి. అక్టోబరు 27 నుంచి ఆరు నెలల  పాటు పాదయాత్ర చేస్తున్నట్లు ప్లీనరీలో ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3వేల కిలోమీటర్లు నడుస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్ పాదయాత్రకు రెడీ అయ్యారు.

జగన్ పాదయాత్రపై ప్లీనరీలో విస్పష్ట ప్రకటన చేశారు జగన్. అక్టోబరు 27న పాదయాత్రను ఇడుపులపాయలో షురూ చేసి అక్కడినుంచి తిరుపతి కొండెక్కి దేవుడని దర్శించుకుంటానని చెప్పారు. తిరుమలకు నడుస్తానని, ఏడుకొండల వాడికి మొక్కుకుంటానని చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అన్నొస్తున్నాడు మంచిరోజులొస్తున్నాయి అని జనాలకు చెప్పాలంటూ కార్యకర్తలను పురమాయించారు జగన్. అన్ని వర్గాల వారికి అన్నొస్తున్నాడు మంచిరోజులు రాబోతున్నయని భరోసా ఇవ్వాలంటూ కోరారు. మీతోపాటు నేను కూడా వస్తానంటూ నడుచుకుంటూ జనాల్లోకి వెళ్దామంటూ కార్యకర్తల హర్షద్వానాల మధ్య పాదయాత్ర ప్రకటన చేశారు.

గతంలో రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి చేవెళ్లు నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. దీంతో అదే ఫార్ములాను జగన్ నవ్యాంధ్రలో అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసమే 9 పథకాలు తీసుకుని జనాల్లోకి వెళ్లాలని సంక్పలించారు. మరి వైఎస్ పాదయాత్ర ద్వారా సిఎం అయినట్లు జగన్ తన పాదయాత్ర ద్వారా సిఎం అవుతారా లేదా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.

మొత్తానికి అప్పుడే జగన్ ఎన్నికల వేడిని రగిలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2018లోనే ఎన్నికలు వస్తాయన్న అంచనాలతోనే జగన్ ఇలా ముందస్తు వరాల ప్రకటన చేశారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకోసమే పాదయాత్రను కూడా ఈ ఏడాదే ఖరారు చేశారని అంటున్నారు.