జగన్ ఎన్నికల శంఖం పూరించాడు. తన ప్రభుత్వం వస్తే ఎవరెవరికి ఏమిచ్చేది 2019 దాకా ఆగకుండా అప్పుడే అమరావతి నుంచి ప్రకటించేశాడు. ఈ హామీ , భరోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చాడు. అన్నొస్తున్నాడు మంచిరోజులొస్తున్నాయని చెప్పండంటూ కార్యకర్తలను పురమాయించాడు. అక్టోబర్ 27 నుంచి ఎన్నికల పాదయాత్ర చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. ఆయన ప్రసంగంలో తాను ముఖ్యమంత్రి అయిపోయానన్నంత విశ్వాసం తొణికిస లాడింది.

న్యవాంధ్ర ప్లీనరీని ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన సభగా మార్చేశారు ప్రతిపక్ష నేత జగన్. తాను సిఎం అవుతున్నానని పదేపదే ప్రకటించారు. కార్యకర్తలు ఇప్పటినుంచే జనాలకు ఆ మాట చెప్పాలని ఉపదేశించారు. తాను అధికారంలోకి రాగానే 9 కార్యక్రమాలు చేపడతానని వాటి గురించి ఒక్కొక్కటి విడమరచి చెప్పారు. మీ ఆత్మవిశ్వాసం చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుంటాయి-ప్లీనరీలో 20 అంశాలపై చర్చలు జరిగాయి. అధికారాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టి 100 రోజుల్లో నాన్నగారు చనిపోయారు. వైఎస్‌ఆర్ బతికుంటే రాష్ట్రం విడిపోయేదా? అని ప్రశ్నించారు జగన్.

అవినీతిలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వైసీపీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇక భవిష్యత్‌ మనదే అని మీ ముఖాల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందన్నారు. సొంతమామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారాన్ని లాక్కున్నారన్నారు. అటువంటి వ్యక్తి జనాలకు వెన్నుపోటు పొడవడా అని ప్రశ్నించారు. వైఎస్‌ మాత్రం రెండుసార్లు ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం అయ్యారన్నారు.

నాన్నగారి 68వ జయంతి.. దివంగత నేతను జ్ఞాపకం తెచ్చుకుంటే.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 2004లో చేసిన పాలన వల్ల 2009లో అధికారాన్ని తీసుకొని వచ్చి కాంగ్రెస్‌ పార్టీ చేతుల్లో పెట్టి.. ఆ దివంగత నేత అనూహ్య పరిస్థితుల్లో మనందరికీ దూరమయ్యారు' అని వైఎస్‌ జగన్‌ ఆవేదనగా అన్నారు. ఆ దివంగత నేత బతికే ఉంటే ఆడపిల్లలు, విద్యార్థులు, అవ్వతాతలు.. ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ దివంగత నేత మృతిని తట్టుకోలేక ఎంతోమంది గుండె ఆగి చనిపోయారు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు.

 ఆ దేవుడు ప్రజల గుండెల్లో ఎందుకింత ప్రేమ పుట్టించాడని ఒకసారి ఆలోచిస్తే.. ఒక నాయకుడు హెలికాప్టర్‌లో వెళ్లి కనిపించకపోతే.. అందరూ గుడులకు, మసీదులకు, చర్చీలకు వెళ్లి ఎందుకు ప్రార్థనలు చేస్తారు. ఇంటింటా ఎందుకు నిద్రాహారాలు మాని ఆయన సురక్షితంగా రావాలని కోరుకుంటారు. ఒక నాయకుడు విగ్రహాన్ని తమంతట తామే ప్రతి గ్రామాంలో ఎందుకు ప్రతిష్టించుకుంటారు. వీటన్నింటికీ కూడా సమాధానం నేను చెప్పనవసరం లేదు. నాన్నగారి కన్నా ముందు చాలామంది సీఎంలను చూశాం. తర్వాత కూడా చాలామంది సీఎంలను చూశాం. ముఖ్యమంత్రిగా నాన్నగారు పరిపాలన చేసింది ఐదు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే.

సభలో ప్రతిక్షణం వైఎస్సార్ ను, ఆయన పాలనాకాలాన్ని ఆకాశానికెత్తుతూ జగన్ ప్రసంగం చేశారు. అలాగే టిడిపి అధినేత చంద్రబాబును ప్రతి సందర్భంలోనూ కోట్ చేస్తూ పరుషమైన విమర్శలు చేస్తూ ప్రసంగించారు.