తెలంగాణ జేఏసి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. మిలియన్ మార్చ్ స్పూర్తి యాత్ర సందర్భంగా తార్నాకలోని కోదండరాం ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రలో పాల్గొనడాని ఇంట్లోంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహానంలోంచి దిగడానికి కోదండరాం నిరాకరించడంతో అందులోనే పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనతో పాటు సిపిఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఇద్దరిని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ సమయంలో ఆయన ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు పోలీసులు, ఇటు బారీగా చేరుకున్న జేఏసి నాయకులతో టెన్షన్ వాతావరణం కనిపించింది. అయితే కోదండరాం ట్యాంక్ బండ్ కు చేరుకుంటే విద్వంసం చేలరేగే అవకాశం ఉందని బావించిన పోలీసులు అతడు ఇంటినుండి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు కోదండరాం పోలీసుల అదుపులోనే ఉండనున్నట్లు సమాచారం.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమకారులకు ధైర్యాన్నిచ్చిన నిరసన కార్యక్రమం మిలియన్ మార్చ్. ట్యాంక్ బండ్ పై  2011 మార్చ్ 10 వ తేధీన జరిగిన ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజల ఆకాంక్షను డిల్లీ కి చేర్చింది. అలాంటి కార్యక్రమాన్ని బావితరాలకు గుర్తుండేలా చేయాలన్న ఉద్దేశంతో  తెలంగాణ పొలిటికల్ జేఏసీతో పాటు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలన్ని కలిసి అదే ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ స్పూర్తి సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభ వల్ల మిలియన్ మార్చ్ జరిగినట్లుగా హింస చెలరేగే అవకాశం ఉందంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ సభకు అనుమతి నిరాకరించారంటూ, ఎలాగైనా సభ జరిపితీరతామని జేఏసి కూడా తెగేసి చెప్పింది. దీంతో ఇవాళ ట్యాంక్ బండ్ పై ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సిటీలో కీలకమైన ట్యాంక్ బండ్ పై ఈ సభ వల్ల ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  350 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మొహరించారు. ట్యాంక్‌బండ్ వైపు గుంపులుగా వచ్చే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అలాగే ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు.  అలాగే సిటీలోని ఓయూలాంటి సున్నితమైన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.  
 


ఈ స్పూర్తి సభకోసం బయలుదేరిన జేఏసి కార్యకర్తలను, ప్రజలను పోలీసులు ఎక్కడికక్కడ ఆపేసి అదుపులోకి తీసుకుంటున్నారు. జిల్లాల్లోంచి బయలుదేరిన నాయకులను నగర శివారులోనే అరెస్ట్ లు చేస్తున్నారు. ఇక చాలామంది నాయకులను నిన్నటి నుంచే ముందస్తు అరెస్టులు చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన చేపడుతున్న మిలియన్ మార్చ్ స్పూర్తి యాత్రను అడ్డుకోవడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని జేఏసి నాయకులు ప్రభుత్వం పై మండిపడుతున్నారు.