కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ ఇంటిపై ఐటీ సోదాలు ఆసక్తిగా మారిన గుజరాత్ రాజకీయాలు
బెంగళూరు క్యాంపులో ఉన్న గుజరాత్ కి చెందిన కాంగ్రెస్ ఎమ్మేల్యేల గదుల్లో ఐటీ శాఖ అధికారులు ఈ రోజు ఉదయం దాడులు చేపట్టారు.రాష్ట్రంలో ఇటీవల సంక్షోభానికి గురైన కాంగ్రెస్ పార్టీ.. తమ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా..తాజాగా ఆ ఎమ్మెల్యేలు ఉంటున్న గదుల్లో ఈ రోజు ఉదయం 7గంటల నుంచి ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపడుతున్నారు. తొలుత కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఇంటిపై బుధవారం ఉదయం ఐటీ అధికారులు దాడి చేశారు. ఆ తర్వాత మంత్రి ఇంటికి సమీపంలో గల ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్ లో ఉంటున్న గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల గదులను కూడా తనిఖీలు చేస్తున్నారు.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల గుజరాత్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో మిగతా ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ 42 ఎమ్మేల్యేలను బెంగళూరికి తరలించింది.వారికి కర్ణాటక మంత్రి శివకుమార్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
