వినటానికి ఆడ్ గా ఉన్నా పొత్తుల విషయంలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణలకు తెరలేచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విశ్వీసనీయవర్గాల చెప్పే ప్రకారం వచ్చే ఎన్నికల్లో టిడిపి-కాంగ్రెస్ లు పొత్తులు పెట్టుకునే అవకాశాలున్నాయి. వినటానికే ఏదోలా ఉన్నా, నమ్మశక్యంగా లేకున్నా తెరవెనుక ప్రయత్నాలైతే జరుగుతున్నాయన్నది వాస్తవం.

బయటకు అందరికీ కనిపించేది మాత్రం వచ్చే ఎన్నికల్లో టిడిపి-టిఆర్ఎస్ లు పొత్తులు పెట్టుకుంటాయని. అందుకు టిడిపి సీనియర్ నేతలు మోత్కుపల్లి నరసింహులు లాంటి వాళ్ళు చేస్తున్న ప్రకటనలతో అందరిలోనూ అదే అభిప్రాయం ఉంది. అయితే, టిడిపితో పొత్తులు పెట్టుకోవటానికి టిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏమాత్రం ఇష్టపడలేదట.

కెసిఆర్ ఉద్దేశ్యంలో తెలంగాణాలో టిడిపి చచ్చినపాముతో సమానమట. టిడిపిలోని ప్రముఖులు పొత్తుల విషయాన్ని కెసిఆర్ తో ప్రస్తావించారు. వారితో కెసిఆర్ మాట్లాడుతూ, ‘మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఉపయోగం లేదని కావాలంటే టిడిపిని తమ పార్టీలో విలీనం చేసుకోవటానికి అభ్యంతరం లేద’ని కెసిఆర్ స్పష్టంగా చెప్పారట.  టిడిపి నేతలకు అదే బాగుంటుందని అనిపించే భేటీ తర్వాత పొత్తు కాదు విలీనమే అంటూ బాహాటంగా వాదించటం మొదలుపెట్టారు.

అదే విషయాన్ని చంద్రబాబునాయుడు వద్ద తెలంగాణా నేతలు ప్రస్తావించినపుడు పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేయటానికి అంగీకరించలేదట. ప్రస్తుతం తెలంగాణాలో టిడిపి ఇబ్బందుల్లో ఉన్నా భవిష్యత్తులో పుంజుకునే అవకాశం లేకపోలేదన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. అందుకనే విలీనం ప్రతిపాదనను రెజెక్ట్ చేశారట. మరి, వచ్చే ఎన్నికల్లో టిడిపి ఏం చేస్తుంది?

టిడిపితో పొత్తుకు కెసిఆర్ అంగీకరించటం లేదు. బిజెపితో పొత్తుల విషయం సందిగ్దంలో ఉంది. టిడిపితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయటానికి బిజెపి ఇష్టపడటం లేదు. ఇక మిగిలింది ఒకే ఒక ఆప్షన్. అది కాంగ్రెస్ తో కలవటమే. కాంగ్రెస్, టిడిపిలకు టిఆర్ఎస్ ఉమ్మడి శతృవన్న విషయం అందిరికీ తెలిసిందే. తెలంగాణాలో అక్కడక్కడ జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి టిఆర్ఎస్ ను ఓడించిన విషయం మరచిపోకూడదు.

కాబట్టి టిఆర్ఎస్ ను ఎదుర్కోవటానికి టిడిపి, కాంగ్రెస్ లు చేతులు కలిపే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణాలోని ఓ టిడిపి ఎంఎల్ఏ మాట్లాడుతూ ‘వచ్చే సాధారణ ఎన్నికల్లో టిడిపి-కాంగ్రెస్ పొత్తులుండే అవకాశాలున్నాయ’న్నారు. ‘ఒక్క తెలంగాణాలో మాత్రమే కాదని ఏపిలో కూడా కలిసి పోటీ చేస్తాయ’న్నారు. అదే విషయాన్ని టిడిపికి మద్దతుగా నిలిచే ఓ పత్రిక కూడా స్పష్టం చేయటం గమనార్హం.