యూపి నుండి రాజ్యసభకు పురంధేశ్వరి ?

First Published 26, Dec 2017, 4:18 PM IST
is purandeswari lobbying for RS nomination from UP
Highlights
  • భారతీయ జనతా పార్టీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర రాజకీయాలకు కొంతకాలం గుడ్ బై చెబుతున్నారా?

భారతీయ జనతా పార్టీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర రాజకీయాలకు కొంతకాలం గుడ్ బై చెబుతున్నారా? ఉత్తర్ ప్రదేశ్ ను కేంద్రంగా చేసుకుని భవిష్యత్ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారా?  విశ్వసనీయవర్గాలు అవుననే అంటున్నాయి. పార్టీలో కూడా ఇపుడా విషయంపైనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, 2014 ఎన్నికల తర్వాత భాజపా-టిడిపిల మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉన్న విషయం అందరికీ తెలిసిందే.  అవసరమొచ్చినపుడు భాజపా కేంద్ర నాయకులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. మొన్నటి గుజరాత్ ఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయన్నది వాస్తవం.

ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో పరిస్ధితులు ఎలాగుంటాయో ఎవరూ చెప్పలేకున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలని భాజపాలోని కొందరు నేతల ఆరాటం. ఆరాటముంటే సరిపోదు కదా? వాస్తవ పరిస్ధితులు అందుకు అనుకూలించాలి. నిజానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గట్టి పోటీ చేసే అభ్యర్ధులు దొరకటం కూడా అనుమానమే.

ఇటువంటి పరిస్దితుల్లో రాజకీయంగా ఉన్నత పదవులు అందుకోవాంటే ఏపిలో ఉంటే ఎంత వరకూ ఉపయోగమని పురంధేశ్వరి యోచిస్తున్నట్లు సమాచారం. సమీప భవిష్యత్తులో ఏపిలో భాజపా కీలక పాత్ర పోషించేది అనుమానమే. అందుకనే ఉత్తరాది రాష్ట్రాల వైపు పురంధేధశ్వరి ఆలోచిస్తున్నారట. అందులోనూ ఉత్తరప్రదేశ్ లో మంచి భవిష్యత్తుంటుందని అనుకుంటున్నారట. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.

ఇంతకీ అవేంటంటే, యూపి నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మనోహర్ పారికర్ తన సభ్యత్వానికి రాజీనామా చేసారు. సభ్యత్వం కాలపరిమితి ఇంకా రెండున్నరేళ్ళుంది. అంటే పారికర్ ఖాళీ చేసిన స్ధానంలోకి వచ్చే వారు రెండున్నరేళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. అయితే, యూపి నేతలెవరూ ఆథ స్ధానంలోకి వెళ్ళటానికి ఇష్టపడటం లేదట. ఎందుకంటే, త్వరలో 6 సంవత్సరాల పూర్తి కాలపరిమితి ఉండే స్ధానాలు 8 వస్తున్నాయట. అందుకనే స్ధానిక నేతల చూపంతా ఆ 8 స్ధానాలపైనే ఉందట.

ఆ విషయం ఆనోటా ఈనోటా పురంధేశ్వరి చెవిలో పడిందట. దాంతో ఆ స్ధానం కోసం పురంధేశ్వరి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ భాజపా జాతీయ నాయకత్వం గనుక పురంధేశ్వరికి అవకాశం ఇస్తే, ఏపి నుండి యూపి రాజకీయాల్లోకి ప్రవేశించే రెండో నేత అవుతారు. ఎందుకంటే, గతంలోనే జయప్రద కొంతకాలం చక్రం తిప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

loader