ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి అత్యంత దారుణంగా హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలో సుధీర్ అనే విధ్యార్థిని పట్టపగలే కొందరు దుండగులు వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య స్థానికంగా కలకలం సృషటించింది.


ఇవాళ ఉదయం ఇంటర్మీడియట్ పరీక్ష రాయడానికి మూసాపేట్ నుండి కూకట్ పల్లి వైపు వెళుతున్న సుధీర్ ను కొందరు దుండగులు వేటకొడవళ్లతో వెంబడించారు. అయితే వీరిని గమనించిన అతడు వెంటనే ఓ బస్సు ఎక్కి తప్పించుకోడానికి ప్రయత్నించాడు. అయితే ఈ బస్సును వెంబడించిన దుండగులు కూకట్ పల్లి  జెఎస్పిహోండా షో రూమ్ వద్ద సుధీర్ పట్టుకుని నడిరోడ్డుపైనే అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఈ హత్యకు సుధీర్ కు అతడి స్నేహితులతో జరిగిన వివాదమే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సుధీర్‌ స్నేహితులు నవీన్‌, కృష్ణ, మహీ, తేజ తదితరులు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.