కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను అతమార్చాడో దుర్మార్గుడు. ఈ సంఘటన హైదరాబాద్ మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో చోటుచేసుకుంది. ఈ ట్రిపుల్ మర్డర్ కేసు  ఇపుడు నగరంలో సంచలనంగా మారింది.

ఈ హత్యలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నగరంలోని జిల్లెలగూడ సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో హరీందర్ గౌడ్, జ్యోతి అనే దంపతులు నివసిస్తున్నారు. డెంటల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న హరీందర్ గౌడ్ స్వయంగా ఓ క్లినిక్ ను నడుపుతున్నాడు. అయితే గత కొంత కాలంగా  క్లినిక్ సరిగా నడవకపోవడంతో పాటు కుటుంబకలహాలతో ఇతడు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం భార్యతో మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన హరీందర్ విచక్షణను కోల్పోయి తన భార్య జ్యోతి, కుమారుడు అభిజిత్(6), కూతురు సహస్ర(4)లను దారుణంగా హత్య చేశాడు. భార్యను గోడకేసి బలంగా కొట్టి, పిల్లల గొంతు నులిమి చంపేశాడు. 

అనంతరం అతడే స్వయంగా మీర్‌పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.