హైదరాబాద్‌ కొంపల్లిలో దారుణం జరిగింది.  శివశివాని కాలేజీలో ఎంబీఎ రెండో సంవత్సరం చదువుతున్నఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడితో ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడుతూ అతడు చూస్తుండగానే హాస్టల్ గదిలోని ప్యాన్ కు ఉరేసుకుంది. దీంతో అతడు వెంటనే యువతి ఉండే హాస్టల్ కు చేరుకున్నప్పటికి అప్పటికే జరగాల్సిన దారుణం జరిగింది. విద్యార్థిని ప్యాన్ కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. 

వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాకు చెందిన బుగ్గయ్య చౌదరి కుమార్తె హనీషా చౌదరి ఉన్నత చదువు కోసం హైదరాబాద్ కు వచ్చింది. ఇక్కడ నగర  శివారు ప్రాంతమైన కొంపల్లిలోని శివశివాని కాలేజీలో హనీషా ఎంబీఏ చదువుతోంది. అక్కడే కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటోంది. అయితే ఈమె దక్షిణ్ పటేల్ అనే యువకుడితో గతకొన్ని రోజులుగా ప్రేమాయణం కొనసాగిస్తోంది. 

అయితే రోజూ మాదిరిగానే ప్రియుడికి వీడియో కాల్  చేసిన హనీషా అతడు చూస్తుండగానే ఫ్యాన్ కు ఉరేసుకుంది. అతడు ఎంత వారించినా వినిపించుకోలేదు.  దీంతో అతడు వెంటనే యువతి ఉండే హాస్టల్‌ కి చేరుకున్నాడు. ఈమె గదికి లోపల గడియపెట్టి ఉండడంతో తలుపులు బద్దలుకొట్టి తెరిచాడు. అయితే అప్పటికే చాలా సమయం కావడంతో హనీషా చనిపోయింది. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనీషా ఆత్మహత్యకు ప్రేమ కారణమా ? లేక మరేదైనా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో  పోలీసులు దర్యాప్తు చేపట్టారు.