తన ప్రియురాలిని వేధిస్తున్న ఆకతాయిలను చంపడానికి మారణాయుధాలతో బయలుదేరిన ప్రియుడు పోలీసులకు చిక్కిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు కత్తులను బ్యాగులో వేసుకుని వెళుతున్న యువకులు పట్టుబడ్డారు. వీరి ప్రవర్తనపై అనుమారం వచ్చి పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విశయాలు బైటపడ్డాయి. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మీర్జా మొహసీన్‌ అనే యువకుడు నగరానికే చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెను గతకొంత కాలంగా ఆసిఫ్, ఫయాజ్ అనే ఇద్దరు యువకులు వేధిస్తున్నారు. దీంతో ఈ వేధింపుల విశయాన్ని యువతి మొహసీన్ కు తెలిపింది. దీంతో వీరిపై ఆగ్రహానికి లోనైన మొహసీన్ వీరిద్దరినీ అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం తన స్నేహితుడు అలీ రషీద్‌తో కలిసి బ్యాగ్‌లో కత్తులు తీసుకొని బైక్‌‌పై వారుండే గుర్రంగూడ బయలుదేరారు.  అయితే ఎల్బీనగర్ పోలీసులు సాగర్ రింగ్‌ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా వీరు బ్యాగులో కత్తులు ఉండడాన్ని గమనించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. మీర్జా మోహసీన్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెల్లడించాడు.  

వీరి వద్ద నుంచి మూడు కత్తులు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.