హైదరాబాద్ బీకే గూడలో దారుణం జరిగింది. ఓ సెల్ ఫోన్ కోసం స్నేహితుల మద్య జరిగిన గొడవ చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ముగ్గురు ప్రాణస్నేహితుల మద్య జరిగిన ఈ  గొడవ, హత్య గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

 నగరంలోని బీకేగూడ తులసీనగర్‌కు చెందిన పూర్ణ, నవీన్, రత్నాకర్‌ రాజు ప్రాణ స్నేహితులు. ఎప్పుడూ కలిసి మెలిసిఉండేవారు. అయితే పూర్ణ  కొత్త సెల్ ఫోన్ కొనుక్కోవడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. వీరు ముగ్గురూ కలిసి నవీన్ ఇంట్లో మందు పార్టీ చేసుకునన్నారు. ఈ క్రమంలో నవీన్ ఏదో పనిపై బైటికి వెళ్లి వచ్చాడు.అంతలో అతడి మొబైల్ కనిపించకపోవడంతో స్నేహితులను ప్రశ్నించాడు. దీంతో  ముగ్గురి మద్య  గొడవ జరిగింది. అయితే నవీన్ వేరే ఫోన్ తో తన నంబర్ కు ఫోన్ చేయగా అది రత్నాకర్ వద్ద ఉన్నట్లు తేలింది. దీంతో మద్యం మత్తులో ఆగ్రహం ఆపులేకపోయిన పూర్ణ, నవీన్ లు రత్నాకర్ పై దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన  రత్నాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఈ హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పూర్ణ, నవీన్ లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.