మహిళా సాధికారత గురించి ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, మహిళా సంఘాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన వారిపై హింస కొనసాగుతూనే ఉంది. చిన్న చిన్న సరదాలకు కూడా కులం కట్టుబాట్లు, కుటుంబ పరువు అడ్డువచ్చి మహిళా స్వేచ్చను హరించివేస్తున్న అనేక సంఘటనలు మనం నిత్య జీవితంలో చూస్తున్నాం. కానీ ఓ పెళ్లి వేడుకలో బంధువలతో సరదాగా గడపడం కూడా తనకు అవమానంగా భావించిన భర్త కట్టుకున్న భార్యను కడతేర్చిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్ కత్తా లో చోటుచేసుకుంది.

ఈ హత్యకు సంబంవధిచిన వివరాలిలా ఉన్నాయి. పర్గానా ప్రాంతానికి చెందిన సప్నా అనే అమ్మాయికి సుబీర్‌ నష్కర్‌ అనే వ్యక్తితో వివాహమైంది.  బందువుల ఇంట్లో వివాహం ఉండటంతో సప్నా తన భర్త, అత్తామామలతో కలిసి వేడుకకు వెళ్లింది. ఈ పెళ్లి వేడుకల్లో అందరు బందువులు కలిసి సరదాగా డ్యాన్స్‌ చేస్తూ సప్నాను కూడా లాగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్యాన్స్ చేసింది.  అయితే ఇలా డ్యాన్స్ చేసి తమ కుటుంబ పరువు తీసిందని సప్నాపై అత్తామామలతో పాటు భర్త ఈ వేడుకల్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో సప్నా తీవ్ర ఆవేధనకు లోనై అక్కడినుండి ఇంటికెళ్లిపోయింది. అయితే ఆమెతో పాటే ఇంటికెళ్లిన భర్త, అత్తామామలు ఈ డ్యాన్స్ విషయంపై మరోసారి సప్నాతో గొడవకు దిగారు. ఈ గొడవలోనే సప్నాను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

సప్నా తల్లిదండ్రుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు తల్లీకొడుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.