కట్టుకున్న భార్యను, కన్న బిడ్డల్ని ఓ కసాయి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. భార్యాపిల్లలతో అన్యోన్యంగా ఉంటూనే హటాత్తుగా అర్థరాత్రి సమయంలో వారిని హతమార్చాడో దుర్మార్గుడు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లింగంపల్లి సమీపంలోని తెల్లపల్లికి చెందిన సురేందర్, వరలక్ష్మీ దంపతులకు నితీశ్‌, యశస్విని అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులు పిల్లలతో కలిసి అన్యోన్యంగా జీవించేవారు. ఇటీవలే  తన భార్యాపిల్లలతో కలిసి ఉగాది పండుగ సందర్భంగా మీర్ పేట శివనారాయణపురంలోని అత్తగారింటికి వెళ్లారు. పండగ రోజు అందరూ కలిసి సరదాగా గడిపారు. అయితే ఇంతలో ఏమైందో గానీ  సురేందర్‌ ఈరోజు తెల్లవారుజామున తన భార్యాపిల్లల్ని అతి దారుణంగా హతమార్చాడు. అనంతరం నేరుగా మీర్ పేట పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. 

దీంతో ఈ హత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలు ఎందుకు చేశాడన్న దానిపై నిందితుడిని విచారిస్తున్నారు.