కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ తాగుబోతు భర్త కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యను అత్యంత దారుణంగా హతమార్చి ఆమె చెవులు కోసి వాటిని తనతోపాటు తీసుకుని పరారైన భర్త ఘాతుకం  కర్ణాటక లోని చిక్ బళ్ళాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.  
  
ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే చిక్కదాసెనహళ్లి గ్రామానికి చెందిన ఆదినారాయణ (32), వెంకటలక్ష్మమ్మ లు భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే భర్త తాగుడు బానిసై ఏ పనీ చేస్తుండకపోడంతో అతడి భార్యే  పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తోంది. అయితే ఆదినారాయణ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తాను మరో పెళ్లి చేసుకుంటానంటూ భార్యకు చెప్పడంతో ఈ మధ్య ఇద్దరి మద్య గొడవలు ఎక్కువయ్యాయి. దీంతో భార్య అడ్డుతొలగించుకోవాలని భావించిన ఆదినారాయణ భార్యను ఒంటరిగా పొలానికి తీసుకువెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు.ఆ తర్వాత ఆమె చెవులు కోసుకుని తనతోపాటు తీసుకుని మృతదేహానికి నిప్పంటించి పరారయ్యాడు.

కాలిపోయిన శవాన్ని గమనించిన చుట్టుపక్కల పొలాల రైతులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ హత్య పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితుడైన భర్త ఆదినారాయణను పోలీసులు అరెస్టు చేశారు. అయితే భార్య చెవులు కోసి జేబులో ఎందుకు వేసుకువెళ్లాడనే దానిపై పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.