ఓ యువతిని కన్న తండ్రే అత్యంత దారుణంగా  హతమార్చిన సంఘటన కేరళలో జరిగింది. ప్రేమించిన యువకుడి కోసం తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిని కాదన్నందుకు యువతిని తండ్రి హతమార్చాడు. పెళ్లికి ముందురోజే ఈ ఘటన జరగడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ పరువు హత్యకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.   

మల్లప్పురం జిల్లాలోని పువ్వత్తి కాండికి చెందిన అతిర అను అగ్రకులానికి చెందిన యువతి, బ్రిజేశ్ అనే దళిత యువకుడు ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసిపోయింది. అయితే దళితుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తే పరువు పోతుందన్న ఉద్దేశ్యంతో అతిర తండ్రి రాజన్ వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే పోలీసులు ప్రేమికులిద్దరు పోలీసులను ఆశ్రయించడంతో రాజన్ పెళ్లికి ఒప్పుకుంటున్నట్లు చెప్పి కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు.

తరువాత రోజు ఈ ప్రేమజంటకు పెళ్లి చేద్దామని ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయి. అయితే రాజన్ తన ఇంటికెళ్లాక కూతురితో మళ్లీ గొడవకు దిగాడు. తనకు ఈ పెల్లి ఇష్టం లేదంటూ ఆగ్రహంతో ఊగిపోతూ కూతురిపై కత్తితో దాడి చేశాడు. అయితే ఈ దాడి నుండి తప్పించుకుందామని అక్కడి నుంచి పారిపోతున్న అతిరను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు.  కత్తిపోట్లతో తీవ్ర గాయాలపాలైన అతిర అక్కడికక్కడే చనిపోయింది.  

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు తండ్రి రాజన్ పై కేసు ఫైల్ చేసి అదుపులోకి తీసుకున్నారు.