నిజామాబాద్ జిల్లా ధర్పల్లి సీఐ కృష్ణ పై బదిలీ వేటు పడింది. తప్పతాగి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పోలీసుల తనిఖిల్లో ఈ సీఐ పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని బాగా సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు ఈ సీఐ పై వేటు వేశారు.  

వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి సిఐ గా పనిచేస్తున్న ధరావత్ కృష్ణ అక్కడి నుండి హైదరాబాద్ కు వస్తుండగా పోలీసులకు చిక్కాడు.  గురువారం రాత్రి ఆయన ధర్పల్లిలో ఫుల్గా మందు కొట్టి కారులో బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో కాబారెడ్డి జిల్లా సదాశివనగర్  పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అయితే మప్టీలో ఉన్న సిఐ వాహనాన్ని ఆపాలని చూడగా ఆయన కారు ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సదాశివనగర్ ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి సిఐ వాహనాన్ని వెంటపడి ఛేజ్ చేశారు. సమీపంలోని చెక్ పోస్టు వద్ద సిఐ వాహనాన్ని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహిస్తే తాగినట్లు తేలింది. అయితే ఆ సమయంలో తాను సిఐని అని చెప్పినా.. సదాశివనగర్ పోలీసులు పట్టించుకోలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ సిపి కార్తికేయ కస్టడీలో సిఐ కృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది.