హైదరాబాద్ కోఠి మెడికల్ కాలేజీ వద్ద ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. జనరల్ తనిఖీల్లో భాగంగా పోలీసులు ఇవాళ కోఠిలో అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. ఇలా అనుమానాస్పదంగా కనిపించిన ఓ ఆటో ను ఆపి అందులోని తరలిస్తున్న సంచుల్ని పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యపోయారు.దాదాపు ఆరు సంచుల్లో డబ్బుల కట్టలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఈ డబ్బుల సంచులను, ఆటోను స్వాధీనం చేసుకుని ఆటో డ్రైవర్ ని సుల్తాన్‌ బజార్‌ పోలీసులు విచారించారు.

ఈ విచారనలో ఆటో డ్రైవర్ ప్రకాశ్ ఈ డబ్బులను నింబోలి అడ్డా నుండి తీసుకువస్తున్నట్లు తెలిపాడు. ఓ ఏజెంట్ నుండి పది రూపాయల నోట్లు సేకరించి వ్యాపారులకు కమీషన్ పై సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. పట్టుబడ్డ ఆరు సంచుల్లోని నగదును లెక్కించగా రూ.12 లక్షలు ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.