గుజరాత్‌లో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్ కోట్ నుండి భావ్‌నగర్‌ కు పెళ్లి బృందంతో వెళుతున్న లారీ రంగోల వద్ద ప్రమాదానికి గురయ్యింది. తెల్లవారుజామున వేగంగా వెళుతూ ఓ వంతెన వద్దకు రాగానే అదుపుతప్పి అందులో పడిపోయింది. దీంతో నిద్రలో వున్న చాలామంది ప్రయాణికులు నిద్రలోనే మృత్యువాతపడ్డారు. ఇలా 26 మంది ప్రాణాలు ఈ ప్రమాదంలో బలవగా మరికొంత మంది తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ దుర్ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వంతెనపై నుండి బాగా ఎత్తునుండి పడటంతో చాలా మృతదేహాలు లారీ కింద పడి నుజ్జునుజ్జయ్యాయి. వాటిని బైటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది కాబట్టి డ్రైవర్ నిద్రమత్తే దీనికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.  ‘‘ఈ ప్రమాదం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నా ఆకాంక్ష’’అంటూ ట్వీట్ చేశారు. తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ.