పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమె భర్త షాడిజానికి తట్టుకోలేకపోయింది. మొదటిరాత్రి రోజు భర్త చేసిన వికృత దాడికి ఆమె ఆస్పత్రిలో చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతోంది.  కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడిగా మారిన విషాద సంఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్ కు శైలజ తో రెండు రోజుల క్రితం గురువారమే పెళ్లయింది. అయితే పెళ్లి తర్వాత రోజే పెద్దలు వారి శోభనానికి ఏర్పాట్లు చేశారు. శోభనం గదిలోకి ప్రవేశించిన శైలజతో భర్త అసభ్యంగా ప్రవర్తించడంతో  రూంలోంచి బయటకు వచ్చింది. అయితే తనకు ఎదురుతిరిగిన భార్య  తనను నపుంసకుడిగా బయట చెప్పినట్లు అనుమానించాడు రాజేష్. దీంతో ఆమెను మళ్లీ తన గదిలోకి తీసుకుళ్లి బ్లేడుతో విచక్షణారహితంగా దాడి చేశాడు.  ఈ బ్లేడ్ దాడితో ఆమె కళ్లకు, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ దాడిలో శైలజ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసి కూడా అత్తింటివారు ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో యువతి అత్తింట్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమె ను చిత్తూరులోని ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం బయటకు పొక్కింది.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఆమెను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించడానికి కుటుంబసభ్యులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ షాడిస్టు భర్త రాజేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ శాడిస్ట్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.