విశాల్ కు మళ్లీ షాక్

First Published 6, Dec 2017, 12:10 PM IST
finally vishal nomination rejected
Highlights
  • ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో హైడ్రామా
  • నో, ఎస్, నో లమద్య సాగిన విశాల్ నామినేషన్
  • చివరికి తిరస్కరను దృవీకరించిన ఎన్నికల సంఘం  

తమిళనాట మరో  రాజకీయ క్రీడ ప్రారంభమైంది. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో  రసవత్తర పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆమె ప్రాతినిద్యం వహించిన ఆర్కే నగర్ కు ఉపఎన్నికల విషయంలో ఇపుడు ఈ రాజకీయ పోరు నడుస్తోంది.

 ఆర్కే నగర్ ఉపఎన్నిల్లో హీరో విశాల్ పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వేసారు. అయితే మంగళవారం  విశాల్ నామినేషన్ పై  పెద్ద హైడ్రామా నడిచింది.   మొదట నామినేషన్ తిరస్కరణ, తర్వాత ఆమోదం, ఆ తర్వాత మళ్లీ తిరస్కరణ ఇలా సినిమా క్లైమాక్స్ ను మించిపోయే ట్విస్టులతో తమిళ రాజకీయం వేడెక్కింది. మొత్తానికి విశాల్ నామినేషన్ పత్రాల్లో సంతకాలను పోర్జరీకి పాల్పడినట్లు పేర్కొంటూ ఎన్నికల సంఘం అతడి నామినేషన్ ను తిరస్కరించింది.

ఈ ఆర్కేనగర్ నామినేషన్లకు సోమవారంతో గడువు ముగియడంతో వాటి మంగళవారం రోజు అధికారులు పరిశీలించారు. అయితే నామినేషన్‌లో అభ్యర్థిని ప్రతిపాదిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇండపెండెంట్ గా పోటీచేయాలనుకున్న విశాల్ నామినేషన్ పత్రాలపై సంతకం చేసిన పదిమందిలో సుమతి, దీపక్ అనే ఇద్దరు ఓటర్లు ఉన్నారు. వారు ఉన్నట్టుండి విశాల్ కు అడ్డం తిరిగారు. ఆ సంతకాలు తమవి కావని, పోర్జరీ చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల అధికారులు ఫోర్జరీ జరిగినట్లు నిర్థారణ చేసుకుని విశాల్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

తనకు అన్యాయం జరిగిందంటూ విశాల్ ధర్నాకు దిగడంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో ఏమోగాని విశాల్ ట్విట్టర్ లో తన నామినేషన్ ను ఎలక్షన్ కమీషన్ ఆమోదించినట్లు ప్రకటించాడు. దీంతో ఆ వివాదానికి తెరపడినట్లేనని అందరూ అనుకున్నారు. 

అయితే అప్పుడే మరో డ్రామా మొదలైంది. రాత్రి 11 గంటల సమయంలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆ  సంతకాలు తమవి కావని సుమతి,దీపన్‌ లు స్వయంగా ఎన్నికల అధికారుల ముందు హాజరయ్యారు. దీంతో మళ్లీ  విశాల్‌ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
మొత్తానికి ఓ సారి తిరస్కరణ, మరో సారి ఆమోదం, మళ్లీ తిరస్కరణతో గంటల వ్యవధిలోనే ఆర్కే నగర్ నామినేషన్ల పర్వంలో ఎన్నో మలుపులు సంభవించాయి. చివరకు విశాల్ నామినేషన్ తిరన్కరణ ను ఎన్నికల సఘం కన్ ఫర్మ్ చేయడంతో గందరగోళానికి తెరపడింది.

loader