టాలీవుడ్ నటుడు, సీరియల్ ఆర్టిస్ట్ సామ్రాట్ రెడ్డి పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు నమోదయ్యింది. అతడిపై దొంగతనం కేసుతో పాటు వరకట్న వేధింపుల కేసు పెట్టింది అతడి భార్య హర్షిత. ఇప్పటికే అతడితో విడిగా ఉంటున్నట్లు, తాను ఇంట్లో లేని సమయంలో సామ్రాట్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు  ఫిర్యాదులో పేర్కొంది.

భర్త సామ్రాట్ అరెస్ట్ తర్వాత హర్షిత మీడియాతో మాట్లాడింది. తాను ఎంతో ఇష్టపడి సామ్రాట్ ను పెళ్లి చేసుకున్నానని, అయితే  వివాహం తర్వాత అతని నిజస్వరూపం బయటపడిందని హర్షిత ఆరోపించింది.  తన భర్త దుర్మార్గాలను ఎన్నో రోజులు భరించానని, తప్పనిసరి పరిస్థితుల్లోనే అతడిపై కేసును పెట్టానని వెల్లడించింది. అతడు సైకోలా మారి తీవ్రంగా హింసిస్తుండటంతో ఇదివరకు వేధింపుల కేసు, అలాగే అతడి తల్లి(తన అత్త) కూడా కట్నం తీసుకురావాలని వేధించడంతో వరకట్న వేధింపుల కేసు పెట్టినట్లు తెలిపింది. అప్పటినుండి వీరి కుటుంబంతో దూరంగా ఒంటరిగా ఉంటున్నట్లు తెలిపింది.

అయితే సంక్రాంతి పండగ కోసం తాను తన స్వస్థలానికి వెళ్లగా, ఇదే అదునుగా బావించి తన భర్త తన ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులతో పాటు గృహోపకరణాలు దోచుకెళ్లాడని ఆరోపించింది. దీంతో అతడిపై తాజాగా దొంగతనం కేసు పెట్టానంది. తన భర్త నుండి న్యాయం జరిగేలా చూడాలని  డిమాండ్ చేస్తున్నట్లు బాధితురాలు హర్షిత తెలిపింది.