ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. బుధవారం ఉదయం కేంబ్రిడ్జిలోని తన నివాసంలో సుమారు 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని కుటుంబసభ్యులు కూడా ధృవీకరించారు. 1942, జనవరి 8న ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ షైర్ కౌంటీలో జన్మించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.  మొదటి నుండి కూడా పరిశోధనలంటే బాగా ఇష్టం. అందుకనే భౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ సిద్ధాంతాలపై అధ్యయనాలు చేశారు.

నాడీ సంబంధిత వ్యాధితో దశాబ్ధాలుగా చక్రాల కుర్చీకే పరిమితమైనా, కంప్యూటర్‌ సాయంతో విశేష జీవితాన్ని గడిపారాయన. హాకింగ్‌ పూర్తిపేరు స్టీఫెన్‌ విలియం హాకింగ్‌. కేంబ్రిడ్జ్‌, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీల్లో భౌతిక శాస్త్రాన్ని ఔపోసనపట్టిన ఆయన కృష్ణబిలాల(కాలబిలాల)పై లోతైన అధ్యయం చేశారు. ఆ క్రమంలో కాలానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో హాకింగ్‌ రాసిన ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్’  పుస్తకం ప్రపంచంలోనే బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది.

భూగోళంపై మనిషి మనుగడకు కాలం తీరిపోనుందంటూ హెచ్చరించిన హాకింగ్‌ వీలైనంత త్వరగా ఇతర గ్రహాలపై ఆవాసాలు నిర్మించాలని గట్టిగా కోరిన సంగతి తెలిసిందే. ‘‘మరణం తర్వాత జీవితం లేదు స్వర్గం అనేది కట్టుకథ’’ అని ఆయన తన పుస్తకంలో చెప్పారు. హాకింగ్ మృతిపై ప్రధానమంత్రి తదితరులు తమ సంతాపాన్ని తెలిపారు.