స్కూల్ యాజమాన్యం ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేయడంలేదని మనస్థాపంతో ఓ చిన్నారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. స్కూల్లోనే విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించగా దీనిని గుర్తించిన సిబ్బంది ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడారు. దీంతో విద్యార్థికి ప్రాణాపాయం తప్పింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  దిల్‌సుఖ్‌నగర్‌లోని గౌతం మోడల్ స్కూల్ లో శివమణి అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. ఇతడు తన క్లాస్ మేట్స్ అందరితో కలిసి ఫేర్ వేల్ పార్టీ ఏర్పాటు చేయాలని స్కూల్ టీచర్ ను కోరారు. యాజమన్యం అనుమతి తీసుకున్నాక దీని గురించి ఆలోచిద్దామని టీచర్ వారితో తెలిపింది.  ఇలా టీచర్ చెప్పి మళ్లీ చాలారోజులవడంతో బుధవారం విద్యార్థులు ఫేర్‌వెల్‌ పార్టీ విషయమై అడిగినా టీచర్‌ స్పందించలేదు. దీంతో మనస్థాపం చెందిన శివమణి తరగతిగదిలోనే బ్లేడుతో చేయి కోసుకున్నాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు స్కూల్ సిబ్బందికి తెలపడంతో వారు విద్యార్థిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 

ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎంఈఓ వెంకటేశ్వర్లు పాఠశాలకు చేరుకుని ఈ విషయంపై ఆరా తీశారు. విద్యార్థులు, ప్రిన్సిపల్‌ రేణుకను అడినిగి ఈ ఘటన గురించి వివరణ తీసుకున్నారు.