బీహార్‌లోని నలంద జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో హటాత్తుగా పేలుడు సంబవించింది. ప్యాక్టరీలో బారీగా పేలుడు పదార్థాలు ఉండటంతో పేలుడు తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  

బిహార్ నలంద జిల్లాలోని  జలాలాపూర్ ప్రాంతంలో అక్రమంగా చాలా బాణాసంచా ప్యాక్టరీలు నడుస్తున్నాయి. అలాగే ఈ పేలుళ్లు జరిగిన ప్యాక్టరీ కూడా అక్రమంగా నడిపిస్తున్నట్లు, కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పేలుడు పదార్థాలతో పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జనావాసాల్లో ఉన్న ఈ ప్యాక్టరీలో జరిగిన పేలుడు దాటికి  సమీపంలో ఉన్న ఐదు ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇవాళ ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదం జరగడంతో ఈ ఇండ్లలో పడుకున్న వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

ఈ పేలుళ్లపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఎగిసిపడుతున్న మంటల్ని అదుపులోకి తేవడానికి దాదాపు 2 గంటలు శ్రమించారు.  ఏటీఎస్ పోలీసులు ఈ పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. పేలుడు ధాటికి సుమారు కిలోమీటర వరకు ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రకంపనల కారణంగా సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.