తెలంగాణ పోలీసులు అక్రమ సంబంధాల కేసుల్లో చిక్కుకుని పోలీస్ శాఖ పేరును చెడగొడుతున్న సంఘటనలు ఈ మద్య ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా  వివాహేతర సంబందాలు పెట్టుకుని సస్పెండ్ అయిన వారిలో ఎఎస్పీ స్థాయి అధికారుల నుండి ఎస్సై స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఉన్నతాధికారులు ఇలాంటిపనులు చేయగా తాము చేస్తే తప్పేముందని అనుకున్నాడో ఏమో గానీ ఓ కానిస్టేబుల్ కూడా ఇలాగే ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కానీ ఈ విషయం బైటపడటంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే సందీప్ అనే వ్యక్తి మొగల్ పురా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇతడు స్నేహ అనే వివాహితతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే వీరి రహస్య అక్రమ బంధం ఆ మహిళ భర్తకు తెలిసింది. దీంతో అతడు వీరిద్దరు కలిసి ఉన్నపుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని శంషాబాద్ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యల్లో బాగంగా సస్పెండ్ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కానిస్టేబుల్ సందీప్ ఇవాళ ఉదయం మౌలాలీ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.