కాకతీయ టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ పరకాలను రెవెన్యూ డివిజన్ గా చేస్తామని హామీ వరంగల్ అభివృద్దికి కట్టుబడి ఉంటానన్న సీఎం టెక్స్ టైల్ పార్కు వల్ల లక్ష ఉద్యోగాలు
వరంగల్ లో కాకతీయ టెక్సటైల్ పార్కును అజాం జాహీ మిల్లును తలదన్నే రీతిలో ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ వరంగల్ లో ఏర్పాటుచేయనున్న కాకతీయ టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమంతో ఆయన పాల్గొన్నారు. శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ టెక్స్ టైల్ పార్కును బారత దేశంలోనే అతిపెద్ద పార్క్ గా తీర్చిదిద్దుతామని వరంగల్ ప్రజలకు సీఎం హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణను బంగారు వరంగల్ తోనే మొదలు పెడుతున్నామని కేసీఆర్ అన్నారు.ఇంకా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే
ఇంత పెద్ద టెక్స్ టైల్ పార్కును సాధించుకున్న వరంగల్, పరకాల ప్రజలకు ముందుగా అబినందనలు
తన వెంట పడీ మరీ ఈ ప్రాజెక్టును సాధించుకున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి మరియు మంత్రి కడియం శ్రీహరిల పట్టుదల ఫలితమే ఈ ప్రాజెక్టు
ఇతర రాష్ట్రాల్లోని బీవాండి, షోలాపూర్, సూరత్ లకు వలస పోతున్న చేనేత కార్మికుల వలసలను ఆపడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పటికే అక్కడికి వలస పోయిన తెలంగాణ బిడ్డలకు స్వ రాష్ట్రానికి స్వాగతం పలుకుతున్నా.
ఆజం జాహి మిల్లును తలదన్నే రీతిలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసి స్థానికంగా ప్రత్యక్షంగా 22 వేల ఉద్యోగాలు, పరోక్షంగా 50 వేల పైచిలుకు ఉద్యోగాలు కల్పించనున్నాం. ఈ ఒక్కరోజే 22 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని 3900 కోట్ల పెట్టుబడుల రాబట్టాం
దీనికి కాకతీయ అనే పేరు పెట్టడం వల్ల బర్కత్ ఉంటది.అన్ని రకాల పరిశ్రమలతో పాటు, షాపింగ్ కాంప్లెక్స్ లను వరంగల్ పట్టణంలో ఏర్పాటు చేస్తాం.
సూరత్ ,తిరుపూర్ , షోలాపూర్ , బివాండి పట్టణాల్లో దొరికే వస్త్రాలను ఒక్క వరంగల్ లోనే లభించేలా తీర్చిదిద్దుతాం. పత్తి నుంచి బట్టలు తయారయ్యేవరకు అన్ని పరిశ్రమలు ఏర్పాటుచేస్తాం.
అలాగే ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు పరకాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు,50 కోట్ల ప్రత్యేక నిధిని పరకాలకు ప్రకటిస్తున్నా
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఆదాయ వృద్ది రేటులో మొదటిస్థానంలో ఉన్న తెలంగాణ దీని రాకతో మరింత అభివృద్ది చెందనుంది.
అలాగే టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో ద్వారా 15 రోజుల్లో 57 రకాల పర్మీషన్లు ఇస్తున్నామని, దీని ద్వారా ఇప్పటికే 5,017 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశాం. ఆన్ లైన్ లో కూడా అనుమతులు మంజూరు చేస్తున్నాం, దీని వల్ల 1,17వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
అలాగే తెలంగాణ ప్రభుత్వం 50 రకాల సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకోసం తీసుకువచ్చింది. పాడి పరిశ్రమ కోసం 100 సంచార పశు వైద్యశాలలు,ఆటోలకు, వ్యవసాయ మార్కెట్ లకు పన్ను మినహాయింపు, 504 రెసిడెన్సియల్ విద్యాసంస్థల ఏర్పాటు,ఓవర్సీస్ స్కాలర్షిప్ లు అందించడం లాంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం.
ప్రపంచంలోనే మొదటిసారి అసంఘటిత రంగంలో ఉన్న రైతులను సంఘటిత రంగంలోకి తీసుకురావడానికి 5000 కోట్లతో ప్రణాళికలు రూపొందించాం.అలాగే ఇప్పటివరకు 25 లక్షల 80 వేల గొర్రెల పంపిణీ చేశాం. 1000 కోట్లతో మత్స్య పరిశ్రమను అభివృద్ది పరుస్తున్నాం.
పంచాయితీరాజ్ వ్యవస్థను పటిష్టపరిచే బిల్లును రానున్న శాసన సభ సమావేశాల్లో ప్రవేశ పెడతాం.లంబాడి తండాలను, గిరిజన గ్రామాలను పంచాయితీలుగా మార్చడానికే ఈ బిల్లు. అలాగే గడువులోపే గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుపుతాం,
ఈ కార్యక్రమానికి అధికంగా ప్రజలు వచ్చి, ఓపికగా తన ప్రసంగాన్ని విన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా.
ఇలా కేసీఆర్ ప్రసంగం హామీలు, అభినందనలుతో ఆసక్తికరంగా సాగింది.
