‘తెలంగాణాలో నాయకత్వానికి తమ కుటుంబం దూరంగా ఉంటుంది’..ఇది చంద్రబాబునాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణాలోని నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు తెలంగాణా నేతలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ, తెలంగాణా నేతల పనితీరుపై మండిపడ్డారు.

తెలంగాణాలో పార్టీని బ్రతికించుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్, లోకేష్, బ్రాహ్మణిలో ఎవరో ఒకరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దానికి జవాబుగా చంద్రబాబు మాట్లాడుతూ, తమ కుటుంబం నుండి ఎవరు కూడా తెలంగాణాలో నాయకత్వ బాధ్యతలు తీసుకోరంటూ స్పష్టం చేశారు. దాంతో కార్యకర్తలు చప్పపడిపోయారు.

అదే సమయంలో టిఆర్ఎస్ తో పొత్తులంటూ కొందరు, విలీనమంటూ ఒక నేత తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తున్నట్లు ఆరోపించారు. ఆ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ, ఏ పార్టీలో కూడా టిడిపిని విలీనం చేసే ప్రశక్తే లేదన్నారు. అవసరాన్ని బట్టి ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. టిఆర్ఎస్ లో టిడిపిని విలీనం చేస్తే తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ నిజామాబాద్ కు చెందిన కొందరు కార్యకర్తలు ఏకంగా చంద్రబాబునే హెచ్చరించటం గమనార్హం.

మొత్తం మీద నేతలపై కార్యకర్తల్లో పేరుకుపోయిన ఆగ్రహం చంద్రబాబు సమావేశంలో బయటపడింది. అందుకనే చంద్రబాబు కూడా ఏ ఒక్కరి పేరును ప్రస్తావించకుండా నేతలకు గట్టిగా చురకలు తగిలించారు. బుధవారం జరగాల్సిన పొలిట్ బ్యూరో, కార్యవర్గ సమావేశం గురువారం ఉదయానికి వాయిదాపడింది.