రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి దావోస్ వేదికగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకున్నది. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, ఐటి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. అదే విధంగా తెలంగాణా నుండి ఐటి మంత్రి కెటిఆర్ కూడా హాజరయ్యారు. సరే, దావోస్ కు రాష్ట్రాల తరపున వెళ్ళారు కాబట్టి ఎవరి అజెండాలు వాళ్ళకుంటాయి కదా? అయితే వాళ్ళు నలుగురూ ఒకేచోట ఎదురుపడ్డారు. దాంతో చంద్రబాబునాయుడు, కెటిఆర్ కాసేపు మాట్లాడుకున్నారు.

ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒకరికి మరొకరు ఎదురుపడినపుడు హలో చెప్పుకోకుండా ఎలా ఉంటారు? అందరూ తెలుగు వాళ్ళే పైగా విదేశీగడ్డ మీద ఎదురుపడ్డారు. దాంతో వాళ్ళల్లో ఒకవిధమైన ఆత్మీయభావం కలిగింది. అందుకనే చంద్రబాబు, కెటిఆర్ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. పైగా మంగళవారం నారా లోకేష్ పుట్టినరోజు కూడా. ఇంకేముంది లోకేష్ ను చూడగానే కెటిఆర్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అక్కడే ఉన్న పారిశ్రామికవేత్త, టిడిపి ఎంపి జయదేవ్ కూడా వారితో మాట కలిపారు. తర్వాత అందరూ కలిసి సరదాగా ఫొటోలకు ఫోజులిచ్చారు.

ప్రారంభ ప్లీనరీలో కెటిఆర్ తెలంగాణాకు ప్రాతినిథ్యం వహించారు. ప్రధాని మోదీతో పాటు పలు దేశాధినేతలు, పలువురు సీఎంలు, ప్రముఖ కంపెనీల సీఈవోలు పాల్గొన్న భేటీకి కేటీఆర్ హాజరయ్యారు. పలు సెషన్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ప్రముఖ కంపెనీల సీఈవోలను కలవనున్నారు. అలాగే, చంద్రబాబు కూడా ప్రపంచంలోని పలువురు సిఈవోలను కలిసి ఏపిలో పెట్టుబడులపై చర్చిస్తున్నారు.