జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనం కోసం వెళ్లివస్తున్న ఓ కుటుంబం కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులు మృతిచెందారు.  మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి కారులో మంగపేట మండలం మల్లూరు దేవస్థానానికి దైవదర్శనం కోసం వెళ్లారు. అక్కడ కుటుంబం మొత్తం ఆనందంగా గడిపి తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో  భూపాలపల్లి జిల్లాలోని హైదరాబాద్-భూపాలపట్నం రహదారిపై తాడ్వాయి మండల కేంద్రం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన వున్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీట్లలో కూర్చున్న దంపతులు మృతిచెందగా వెనకాల కూర్చున్న కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.