తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన యువతను గాలికివదిలేసి, కేవలం రాజకీయాల కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని  బిజేపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులను ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదంటేనే ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వ చిత్తశుద్ది ఏమిటో అర్థమవుతుందన్నారు. ఉద్యోగాలు, నీళ్లు , నిధులే ఎజెండాగా ఏర్పడిన తెలంగాణలో ఏ ఒక్కటి నెరవేరలేదని, ముఖ్యంగా నియామకాల విషయంలో అయితే మరింత అన్యాయం జరిగిందన్నారు. టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక వీటిపై ఉన్న ఆశలన్నీ ఆడియాశలు అయ్యాయని, దీంతో తెలంగాణ యువత ఉద్యోగాలపై ఆశల్లేక నిరాశ చెందుతున్నారని మండిపడ్డారు.

ఇవాళ కొలువులకై కొట్లాట సభకు మద్దతివ్వాల్సిందిగా జేఏసి చైర్మన్ కోదండరాం లక్ష్మణ్ ని కలిశారు. సమావేశం ముగిసిన అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణ కోసం పోరాటం చేసిన యువత మళ్ళీ ఉద్యోగాలకోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో లక్షా 12  వేల ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం హామీ నెరవేరే వరకు తమ పార్టీ తరపున ఉద్యమాలు చేస్తామన్నారు.  

కొత్త ఉద్యోగాలు అటుంచితే.. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్న పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. అందుకు ఉదాహరణ  హౌసింగ్ కార్పొరేషన్, డీబిఆర్ మిల్, సిర్పూర్ మిల్ లు మూత పడటమే అని గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వం ఇప్పటివరకే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రచారం చేసుకుంటోందని, అన్ని ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పించాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

బీజేపి టీఆర్ఎస్ తో దగ్గరవుతోందన్న ప్రచారాన్ని లక్ష్మణ్ కొట్టిపారేశారు. టీఆరెస్ పార్టీతో  కలిసే ప్రసక్తే లేదని, తెలంగాణలో బీజేపీ మాత్రమే టీఆరెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ అన్నారు.  కేంద్రం అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అందుకే టీఆరెస్ ప్రభుత్వంతో కలిసి  పనిచేస్తోందన్నారు. అంత మాత్రాన బీజేపి టీఆర్ఎస్ దోస్తీ కట్టినట్లు ప్రచారం జరగడం దురదృష్టకరమన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ లు కలిసి నడిచిన చరిత్ర ఉందని వాటితో బీజేపీ ఎప్పుడూ కలవదని లక్ష్మణ్ స్పష్టం చేశారు.