ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బిజెపి పార్టీ ఘన విజయం సాధించడంతో బిజెపి శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. మొత్తం మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. బిజెపి పార్టీకి ఇలా బంపర్ మెజారిటీ రావడంతో అమెరికాలోని ఎన్నారైలు కూడా సంబురాలు జరుపుకున్నారు. ఓహియా స్టేట్ లోని కొలంబస్ సిటీలో ప్రవాస భారతీయులు రంగులు పూసుకుని, మిఠాయిలు పంచుకుని సంబరాల్లో మునిగిపోయారు. 

త్రిపుర, నాగాలాండ్ లలో బిజెపి ముందంజలో ఉందని తెలియగానే ఈ సంబరాలు మొదలయ్యాయి. గెలుపు వార్త తెలియగానే బిజెపి పార్టీని అభిమానించే ప్రవాసులంతా కలిసి ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యంగా త్రిపురలో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెండు దశాబ్దాల కమ్యూనిస్ట్ పాలనకు అంతం పలుకుతూ బిజెపి పార్టీ విజయంతో దూసుకుపోవడం ఆనందాన్నిచ్చిందని పలువురు ఎన్నారైలు తెలిపారు. ఈ ఆనందానికి బోనస్ గా నాగాలండ్ విజయం కూడా యాడ్ అయ్యిందన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణవాసి శ్రీనివాస్ కొంపల్లి ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో తెలుగు ఎన్నారైలు రమేష్ మధు, దుర్వాసుల, అమర్ రెడ్డి, వినీత్ రెడ్డి, శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం , నీల్ పాటిల్ రాజారాం, కిరణ్,శ్యామ్,సలంద్రి తదితరులు పాల్గొన్నారు.