వైద్య సదుపాయం లేక మారుమూల గ్రామాలు, ఆధివాసి ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారో తెలియజేసే విషాద సంఘటన జయశంకర్ జిల్లా లో జరిగింది .ఓ ఆదివాసి మహిళ డెలివరీ కోసం ఆస్పత్రికి వెళుతుండగా రోడ్డుపైనే శిశువు జన్మించి తీవ్ర గాయాలతో మరణించిన హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ఈ శిశువు మరణానికి వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడం ఒక కారణమైతే, అందుబాటులో ఉండాల్సిన వైద్య సిబ్బంది (108) నిర్లక్ష్యం వహించడం మరో కారణం. ఈ సంఘటనకు సంభందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
 


జిల్లాలోని వెంకటాపురం మండల కేంద్రం సమీపంలో గల అటవీ ప్రాంతంలో కొందరు ఆదివాసీ లు నివాసాలు ఏర్పర్చుకుని జీవిస్తున్నారు.  ఈగ్రామం వైద్య సదుపాయానికి దూరంగా ఉంది. అయితే ఈ గ్రామానికి చెందిన ఓ గర్భస్థ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా వైద్య సదుపాయంకోసం 108 కు ఫోన్ చేశారు గ్రామస్థులు. మూడు నాలుగు గంటలైనా అంబులెన్స్ వాహనం రాకపోవడంతో ఏం చేయాలో తెలీక ఎడ్ల బండిపై మహిళనుఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే మార్గమద్యలో నొప్పులు ఎక్కువకావడంతో మహిళన బండి కిందకు దించే ప్రయత్నం చేశారు. అదే సయమంలో శిశువు జన్మించడం, అంత ఎత్తులోంచి రోడ్డుపై శిశువు పడటంతో తలకు తీవ్ర గాయమై మరణించాడు. నవమాసాలు మోసిన శిశువును చేతిలోకైనా తీసుకోకుండానే చనిపోవడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం కావడంలేదు.
అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, 108 సిబ్బంది నిర్లక్ష్యమే తమ చిన్నారి శిశువును పొట్టన పెట్టుకుందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.  అంబులెన్స్ సిబ్బంది సరైన సమయానికి రాకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని గ్రామస్థులు ధ్వజమెత్తారు. 108 సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యలు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.