బీసీసీఐకి సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఝ‌ల‌క్‌. బీసీసీఐ పై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయ విధానాన్ని తప్పుపట్టారు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు బీజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఝలక్ ఇచ్చారు. తాజాగా ఐపీఎల్ ప్రసార హక్కులను సాధారణ పద్ధతిలో విక్రయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ-వేలం ద్వారా కాకుండా సాధారణ పద్ధతిలో ఐపీఎల్ ప్రసార హక్కులను అమ్మడంపై బీసీసీఐ మీద సుప్రీంకోర్టులో కేసు వేస్తానని ఎంపీ ప్రకటించారు. ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయ పద్ధతిని తప్పుపడుతూ ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
వచ్చే ఐదేళ్లకు రూ. 16,347.50 కోట్లకు ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ ఇండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఐపీఎల్ ప్రసార హక్కులను ఈ-వేలం ద్వారా కేటాయించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ-వేలం ద్వారా హక్కులను కేటాయిస్తే బీసీసీఐకి తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకే సాధారణ వేలం ద్వారానే హక్కులను కేటాయించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
అయితే గతంలో వేసిన కేసులో సుబ్రహ్మణ్యస్వామి పలు అంశాలను కోర్టు ముందుంచారు. ఈ-వేలం ద్వారా అయితే అన్ని కంపెనీలకు సమాన అవకాశం దక్కుతుందని ఆయన కోర్టులో వాదించారు. బీసీసీఐ మాత్రం ఈ-వేలం ద్వారా అయితే సమయం వృథా అవుతుందని, జాప్యం వల్ల బీసీసీఐ కి నష్టాలు వస్తాయని వాదించింది. సుప్రీంకోర్టు అంతింగా బీసీసీఐ వాదనతో ఏకీభవించి స్వామి కేసును కొట్టేసింది. అయినప్పటికీ సుబ్రహ్మణ్యస్వామి మరోమారు సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నారు. మరి ఏ ఏ సాంకేతిక అంశాలను ఆయన లేవనెత్తుతారో, సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి...
