Asianet News TeluguAsianet News Telugu

ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అస్వస్థత

విశేష వార్తలు

  • ఉపరాష్ట్రపతి వెంకయ్యకు అస్వస్థత
  • జర్నలిస్టుపై ఎమ్మెల్యేకు పిర్యాధు చేసిన మహిళలు
  • టపాసులు పేల్చి గాయపడిన చిన్నారులు
  • టిటిడిపి సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి
  • హైదరాబాద్ లో పట్టుబడిన అక్రమ ఆయుధాలు
  • తమిళనాడులో కుప్పకూలిన ఆర్టీసి డిపో భవనం
asinet telugu express news from andhra telangana national

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అస్వస్థత

asinet telugu express news from andhra telangana national

భారత ఉపరాష్ట్రపతి, తెలుగుతేజం ముప్పవరపు వెకయ్యనాయుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యేకంగా ఓ డాక్టర్ల బృందం వైద్యపరీక్షలు నిర్వహిస్తోంది. ఈ రాత్రికి వెంకయ్య ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నాడు. అయితే  ఆయన అనారోగ్యానికి సంభందించి అధికారిక ప్రకటనేమీ విడుదల కాలేదు.
 

మహిళలను వేధిస్తున్న హైదరాబాద్ జర్నలిస్టు (వీడియో)


హైదరాబాద్ లోని ఒక టివిచానెల్  కు చెందిన జర్నలిస్టు బంజారాహిల్స్ ఏరియాలో తమను వేధిస్తున్నట్లు బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కాళ్ల మీద పడి తమను ఆ జర్నలిస్టు వేధింపుల నుంచి రక్షించాలని మొరపెట్టుకున్నారు. ఆ జర్నలిస్టుకు మీరు (ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్) కూడా సపోర్ట్ చేస్తున్నారంటూ తమను బెదిరిస్తున్నారని తెలిపారు. లైసెన్స్ లేకుండా ఒక వ్యక్తి నడుపుతున్న వైన్స్ షాప్ కు సదరు జర్నలిస్టు అండగా ఉండి తమను భయపెడుతున్నారని ఆరోపించారు స్థానిక మహిళలు. సీసాలతో తమపై దాడిచేస్తానంటూ బెదిరిస్తున్నట్లు లబోదిబోమంటున్నారు ఆ మహిళలు. మరిన్ని వివరాల కోసం పైనున్న వీడియో చూడండి.

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి

గుంటూరు జిల్లా లో విషాదం చోటుచేసుకుంది. ఓ కాలేజి బస్సు డ్రైవర్ కు డ్రైవింగ్ లో ఉండగా గుండెపోటు రావడంతో బస్సు అదుపు తప్పి ఓ బైక్ ను డీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. అలాగే గుండెపోటు కు గురైన  డ్రైవర్ కూడా మృతి చెందాడు.
 

ఇంజనీరింగ్ విద్యార్థినిపై కత్తులతో దాడి

asinet telugu express news from andhra telangana national

హైదరాబాద్ : పేట్ బషీరాబాద్ లోని నరసింహ రెడ్డి కళాశాలలో దారుణం జరిగింది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న భువనేస్వర్ అనే విద్యార్థిని తోటి విద్యార్థే కత్తితో దాడి చేశాడు. కాలేజ్ బస్ దిగి వెళుతుండగా భువనేశ్వరి పై రోహిత్ కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అడ్డు వచ్చిన మరో విద్యార్థి ని కూడా కత్తి తో పొడిచి గాయపర్చాడు.ఈ దాడిలో రోహిత్ గా అతడి స్నేహితులు కూడా సాయం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారు. అయితే నిందితులకు వత్తాసు పలుకుతూ కళాశాల యాజమాన్యం వారిని తప్పించే ప్రయత్నం చేస్తొందని ఆరోపణలు వస్తున్నాయి.

పంజాగుట్టలో ఆకతాయిల హల్ చల్ 

పంజా గుట్టలో కొందరు ఆకతాయి యువకులు హల్ చల్ సృష్టించారు.  కారులో వెళుతూ టపాకులు కాల్చి రోడ్డు పై వెళుతున్న పాదచారులపై విసిరేసిరివేయడంతో వారు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. కొందరు మహిళలకు గాయాలు కావడంతో వారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా  ఐదుగురు నిందితులను గుర్తించి, వారిని అరెస్ట్ చేసిన పంజా గుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
 

తూర్పు గోదావరి జిల్లాలో పరువు హత్య

తూర్పు గోదావరి జిల్లా లో పరువ హత్య కేసులో ఓ టిడిపి నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే రామచంద్రాపురం టిడిపి పట్టణ అద్యక్షుడిగా ఉన్న నందుల రాజు తన సొంత కూతురినే హత్య చేశాడు. దీనికి ఆమె ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు. కూతురి ప్రేమ వ్యవహారం వల్ల తన పరువు పోయేలా ఉందని బావించిన నందుల రాజు ఈ హత్య చేసినట్లు అరోపిస్తూ ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.   
 

బిసిలకు కేసిఆర్ దీపావళి కానుక

asinet telugu express news from andhra telangana national

హైద‌రాబాద్‌ : బీసీల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు దీపావ‌ళి కానుక‌ను అంద‌జేశారు. బీసీ రుణాల స‌బ్సిడీ రూ.102.8 కోట్లు మంజూరు చేస్తూ.. అందుకు సంబంధించిన ద‌స్త్రంపై సంత‌కం చేశారు. ఈ స‌బ్సిడీ రుణాల వ‌ల్ల రాష్ర్ట వ్యాప్తంగా 12, 218 మందికి ల‌బ్దికి చేకూర‌నుంది. స‌బ్సిడీ రుణాలు మంజూరు కావ‌డం ప‌ట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ స‌బ్సిడీ నిధుల‌ను 12 ఫెడ‌రేష‌న్స్‌కు చెందిన ల‌బ్దిదారుల‌కు స‌త్వ‌ర‌మే అంద‌జేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. బీసీల‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ల‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని ఆయ‌న అన్నారు. స్వ‌యం ఉపాధి ద్వారా బీసీ వ‌ర్గాలు మెరుగైన జీవ‌నాన్ని సాధించాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి జోగు రామ‌న్న పేర్కొన్నారు.
 

అమరుల స్పూర్తి యాత్ర వాయిదా
 

asinet telugu express news from andhra telangana national

హైకోర్టు ఆదేశాలమేరకు నల్లగొండ జిల్లా అమరుల స్పూర్తి యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జేఏసి చైర్మన్ కోదండరాం తెలిపారు. 
నల్లగొండ జిల్లాలో అమరుల స్పూర్తి యాత్ర అనుమతులకోసం టి‌జే‌ఏసి హైకోర్టును ఆశ్రయించడంతో, ఈ  కేసు ఇవాళ విచారణకు వచ్చింది. ఈ సంధర్భంగా న్యాయమూర్తి యాత్రకు అనుమతి ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, యాత్ర రూట్ మ్యాప్ వివరాలు పూర్తిగా లేనందున అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది వివరించారు. యాత్ర నిరాకరణకు ఇది సరైన కారణం కాదని జడ్జి స్పందించారు. యాత్రకు సంబంధించి తేదీలను సోమవారం హైకోర్టే ఖరారు చేస్తుందని జడ్జి పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 
 

విజయవాడ మండలంలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)


కృష్ణా : విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు లోని ఓ ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోదాం లో భారీగా ప్లాస్టిక్ సామాగ్రి ఉండటంతో మంటలు ఎగిసి పడుతున్నాయి.  ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మెదక్ జిల్లా - సర్కారు గొర్రె - వింత సంఘటన 
 

asinet telugu express news from andhra telangana national

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గొర్రెల పెంపకం పథకం లో ఓ వింత సంఘటన జరిగింది. ఈ పథకంలో బాగంగా మెదక్ జిల్లా పరిధిలోని ర్యాలమడుగు గ్రామంలో ఓ లబ్ధిదారుడి చెందిన గొర్రె వింత జంతువుకు జన్మనిచ్చింది. సర్కారు సబ్సిడీతో పొందిన ఈ గొర్రె వింత జంతువుకు జన్మనివ్వడంతో దీన్ని గ్రామస్థులు  వింతగా చూస్తున్నారు. 

ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన డీఎస్పీ రవిబాబు

asinet telugu express news from andhra telangana national

ఓ రౌడీషీటర్ హత్య కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న డీఎస్పీ రవిబాబు చోడవరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే రౌడీ షీటర్ అయిన గేదెల రాజుతో డీఎస్పీకి మంచి సంభందాలున్నాయి. కిరాయి హత్యలకోసం డీఎస్పీ రాజును వాడుకునేవాడు. అదేవిదంగా పద్మలత అనే మహిళను హత్య చేయించాడు.దీనికి సంభందించిన డబ్బులు ఇవ్వకపోవడంతో రాజు రవిబాబు ను బెదిరించసాగాడు. దీంతో ఈ హత్య విషయం ఎక్కడ బయటపడుతుందోన్న ఆందోళనతో రాజు ను కూడా హత్య చేయించాడు డీఎస్పీ. ఈ జంట హత్యల కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటూ రవిబాబు లొంగిపోయాడు.  

కేదార్ నాథ్ ఆలయంలో ప్రదాని మోడీ

asinet telugu express news from andhra telangana national

ఉత్తరాఖండ్ పర్యటనలో బాగంగా ఇవాళ ప్రదాని నరేంద్ర మోడీ కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆయన రాకను పురస్కరించుకుని ఆలయం వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని, అనంతరం కేదార్ నాథ్ లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.  
 

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురికి గాయాలు  

ఆంధ్రప్రదేశ్ : శ్రీకాకుళం జిల్లా సారువకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు బోల్తా పడిన సంఘటనలో పాశిగంగుపేట టిడిపి నాయకుడు వాసుదేవరావు కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనతో పాటు కారులో ఉన్న ఆయన కూతురు చేతన ప్రియ, ఆమె స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం పట్టణంలో ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురిని, ఆమె స్నేహితులను కారులో తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఎదురుగా వస్తున్న క్వారీ లారీని తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

"దీపావళి సందర్భంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తాం''

asinet telugu express news from andhra telangana national

​​

దీపావళి సందర్బంగా బాణా సంచా పేలి గాయపడిన వాళ్ళందరికి సరోజిని కంటి దవాఖానలో మంచి వైద్యం అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నిన్న రాత్రి మొత్తం 30 మంది గాయపడి కంటికి సంబంధమైన సమస్యలతో సరోజిని ఆస్పత్రికి వచ్చారన్నారు. వారిలో 12 మంది తీవ్రంగా గాయపడటంతో ఇన్ పేషంట్లుగా చేర్చుకున్నామని తెలిపారు. అందులో 6 గురికి కంటి ఆపరేషన్లు అవసరమని, ఇప్పటికే ఆపరేషన్ ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. గాయపడిన మిగతా వాళ్లకు ప్రాథమిక చికిత్స చేసి ఇళ్లకు పంపించామని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.
 

సాయి ప్రజ్వల ఆచూకీ లభ్యం

asinet telugu express news from andhra telangana national

​​

నారాయణ కాలేజీలో చదువు పేరుతో వేధింపులు ఎక్కువయ్యాయని లెటర్ రాసిపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఇంటర్‌ విద్యార్థిని సాయిప్రజ్వల ఆచూకీ దొరికింది. ఈ నెల 11న అదృశ్యమైన ఈ యువతి ఫిర్జాదిగూడలోని ఓ హాస్టల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చదువులో ఒత్తిడితోనే ఆమె ఇంటినుంచి వెళ్లినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. 
 

విజయవాడ బెంజి సర్కిల్ లో కారు భీభత్సం

విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వేగంగా దూసుకువచ్చిన బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ప్లాట్ ఫారంపై నిద్రిస్తోన్న యాచకులపై నుంచి దూసుకు వెళ్లింది.  ఈ ప్రమాదంలో సునిల్ (45) అనే వ్యక్తికి తీవ్ర గాయాలవగా,ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. మరో వ్యక్తి సాయోజి రావు (60)  తీవ్రగాయాలతో ఆస్నత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

దీపావళి గాయాలు (వీడియో)

దీపావళి వేడుకల సంధర్భంగా హైదరాబాద్ లో టపాసులు కాలుస్తూ దాదాపు 32 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది ప్రస్తుతం సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది చిన్నారులే ఉండటం, వారికి తీవ్రంగా గాయాలవడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. స్పప్న అనే ఇంజనీరింగ్ యువతి కంటిలోకి రాకెట్ గుచ్చుకుని కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.  అజాగ్రత్తతో టపాసులు కాల్చడం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని వైద్యులు చెబుతున్నారు.
 

టిటిడిపి సమావేశానికి హాజరైన రేవంత్

asinet telugu express news from andhra telangana national

​​

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరుగుతున్న టిటిడిపి ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేవంత్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో ప్రస్తుత సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. అంతే కాకుండా ఇటీవల ఏపీ టిడిపి నేతలపై రేవంత్ చేసిన విమర్శలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశానికి టిటిడిపి అద్యక్షులు రమణ తో ఇతర పార్టీ సీనియర్లంతా పాల్గొన్నారు.
 

హైదరాబాద్ లో పట్టుబడిన అక్రమ మారణాయుధాలు

asinet telugu express news from andhra telangana national

​​

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మారణాయుధాలు పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. మల్కాజిగిరి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో వేరువేరుగా చేపట్టిన తనిఖీల్లో 3 గన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి అక్రమ రవాణాకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు షాట్ వెపన్, కంట్రీ మేడ్ పిస్టల్,  రివాల్వర్ లను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్యాంగ్ కు సరఫరా చేయడానికే ఈ గన్స్ ను నగరానికి తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
 

కర్నూలు జిల్లాలో కీచక ఎస్సైపై వేటు

asinet telugu express news from andhra telangana national

​​

కర్నూలు జిల్లా పుటుకూరు సర్పంచ్ పద్మజ పై అత్యాచార యత్నానికి పాల్పడిన స్థానిక ఎస్సై ఏడుకొండలు పై వేటు పడింది. ఎస్సైని  వేకెన్సీ రిజర్వ్ పై  నెల్లూరుకు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాకుండా ఎస్ ఐ పై సస్పెన్షన్ కోసం నివేదికను డిఐజి కి పంపినట్లు ఎస్పీ తెలిపారు. 
మహిళా సర్పంచ్ పద్మజను గత నాలుగు సెలలుగా ఫోన్ లో వేదిస్తున్నాడు. ఇదే క్రమంలో  దీపావళి సంధర్బంగా పూటుకూరుకు వచ్చిన ఎస్సై ఏకంగా మహిళా సర్పంచ్ ఇంటికే వెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకున్న ఆమె స్థానికుల సహాయంతో జిల్లా ఎస్పీకి పిర్యాదు చేయడంతో అతడిపై చర్యలకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 
 

తమిళనాడులో కుప్పకూలిన ఆర్టీసి డిపో భవనం, 8మంది మృతి 

asinet telugu express news from andhra telangana national

​​

  తమిళనాడులోని నాసైపట్నం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పొరయూరు పట్టణంలో పాతకాలం నాటి భవనంలో కొనసాగుతున్న బస్ డిపో కుప్పకూలి 8 మంది చనిపోయారు. 20 మందికి గాయాలవగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.  చనిపోయిన వారిలో తమిళనాడు ఆర్టీసికి చెందిన నలుగురు డ్రైవర్లు, ముగ్గురు మెకానిక్ లు, ఓ కండక్టర్ ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం, పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి మునియన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios