ఎక్స్ ప్రెస్ న్యూస్ : అర్జున్ రెడ్డి ని తలపించిన మేడ్చల్ మెడికోలు (వీడియో)

asianet telugu express news  Andhra Pradesh and Telangana
Highlights

విశేష వార్తలు

  • హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి జీహెచ్ఎంసీ ప్రయత్నాలు
  • మేడ్చల్ లో మెడికల్ విద్యార్థుల వీరంగం
  • ఈ నెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం
  • ప్రగతి భవన్ లో మంత్రులతో సీఎం సమావేశం
  • గుంటూరులో మరో విద్యార్థి ఆత్మహత్య 


 

అర్జున్ రెడ్డి ని తలపించిన మేడ్చల్ మెడికోలు (వీడియో)

అర్జున్ రెడ్డి సినిమాలో మందు కొట్టి హీరో చేసే వీరంగం మీరు చూసే ఉంటారు. సేమ్ టు సేమ్ అలాంటి ఘటనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మేడ్చల్ లోని మెడిసిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పూడూర్ బీఎన్ఆర్ స్కూల్ బస్సు డ్రైవర్,  ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ లపై మద్యం మత్తులో బూతులు తిడుతూ దాడి చేశారు. ఆపేందుకు వచ్చిన వారిపై కూడా దాడి చేశారు. చివరకు ఎలాగోలా వారిని పోలీసు స్టేషన్ కు తీసుకుపోతే అక్కడ కూడా చిందులేశారు సదరు మెడికల్ విద్యార్థులు. అయితే ఈ తాగి వీరంగం చేసిన మెడికల్ విద్యార్థులను కేసులు, గీసులు లేకుండా విడిచిపెట్టాలని ఇప్పటికే అధికార టిఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. మరి ఇంత వీరంగం సృష్టించిర వీరిపై పోలీసులు కేసులు పెడతారా? లేక అధికారుల ఒత్తిడికి తలొగ్గి విద్యార్థులను వదిలిపెడతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

రామచంద్రాపురం టిడిపి అద్యక్షుడి కూతురి దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో దారుణం జరిగింది. రామచంద్రాపురం నగర టీడీపీ అధ్యక్షుడు నందులరాజు కుమార్తె దీపిక‌ను దుండగులు దారుణంగా హత్య చేశారు. దీపిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో భాగంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  కూనపురెడ్డి మణికంఠ అనే వ్యక్తికి మృతురాలికి ప్రేమ వ్యవహారం సాగిందని, ఇదే ఈమె హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు కత్తితో పొడిచినట్లు భావిస్తున్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో తండ్రి నందులరాజు ఇంటికి వెళ్లేసరికి  దీప్తి రక్తపుమడుగులో పడివుంది. దీంతో అతడు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు  డాక్టర్లు తెలిపారు.  
 

ఓయూలో సీఎం దిష్టిబొమ్మ దహనం

కోదండరాం చేపడుతున్న అమరుల స్పూర్తి యాత్రలో మావోయిస్టులు పాల్గొంటున్నారనే తప్పుడు ప్రచారాన్ని అధికార పార్టీ ఆపాలని ఓయూ లోని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కోదండరాం ను అక్రమంగా అరెస్ట్ చేయడంతో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తగ్గించాలనే ఈ  ప్రచారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. ఈ అసత్య ప్రచారం చేయిస్తున్న సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను ఓయూలో ఐక్య విద్యార్థి సంఘాలు ఆద్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో తగలబెట్టారు.  

మంథనిలో సెల్ టవర్ ఎక్కిన అధికారపార్టీ నాయకులు

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం లో టీఆర్ఎస్ నాయకులు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే కమాన్ పూర్ మండల  వైస్ ఎంపిపి కొట్టే భూమయ్య, యూత్ ఆద్యక్షుడు కొయ్యడ సతిష్ లను ఇటీవల పార్టీ నుండి సస్పెండ్ చేశారు. వీరు స్థానికి ఎమ్మెల్యే పుట్టా మధుకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నారని పార్టీ నుంచి తొలగించారు.
పార్టీ నుండి సస్పెండ్ చేయడం అవమానంగా బావించిన వీరు సెల్ టవర్ ఎక్కి నిరసర తెలుపారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తాము ఎంతగానో కష్టపడ్డామని, ఇపుడు అర్దాంతరంగా పార్టీ నుంచి తొలగిస్తే ఆత్మహత్యే శరణ్యమని వారు వాపోతున్నారు. తమ సస్పెన్షన్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  
 

గుండెపోటుతో ఏఎస్సై మృతి

హైదరాబాద్ లోని పోలీస్‌ అకాడమీ లో అడిషనల్‌ ఏఎస్పీగా విదులు నిర్వహిస్తున్న బానోతు పాండునాయక్ గుండె పోటుతో మృతి చెందాడు. బీబీనగర్‌ మండలంలోని రావిపహడ్‌ తండాకు చెందిన ఏఎస్పీ బానోతు పాండు నాయక్‌ గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ అతడు మృతి చెందాడు.
 పాండు నాయక్‌ మృతి చెందడంతో ఆయన స్వగ్రామం రావిపహడ్‌ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టి ఇంత ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి అర్ధాంతరంగా మరణించడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 

పట్టపగలే రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

 ఉప్పల్ పీఎస్ పరిధిలోని విజపురి కాలనీలో చైన్ స్నాచర్ లు రెచ్చిపోయారు. పట్టపగలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోంచి చైన్ లాక్కుని పరారయ్యారు. వెనుక నుంచి బైక్ పై వేగంగా వచ్చి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ స్నాచింగ్ కు పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళ ఉప్పల్ పోలీసులకు పిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
 

న‌గ‌రంలో మ‌రో నాలుగు ఎక్స్‌ప్రెస్ హైవేలు

 గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో న‌గ‌ర‌వాసుల ట్రాఫిక్ క‌ష్టాలు తీరనున్నాయి. త్వరలోనే జంటనగరాల్లో నాలుగు హై-వే కారిడార్ల నిర్మాణాల‌ు చేపట్టి నగర వాసుల ట్రాఫిక్ కష్టాలను దూరం చేయనన్నట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ వెల్లడించారు. 
జీహెచ్ఎంసీ వివిధ ప్రాజెక్ట్‌ల‌ను త్వ‌రిత‌గ‌తంగా పూర్తిచేయ‌డానికి   ఔట్‌సోర్సింగ్ ప‌ద్ద‌తిలో నియ‌మితులైన 125మంది సైట్ ఇంజ‌నీర్ల‌తో మేయ‌ర్ రామ్మోహ‌న్ నేడు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో చీఫ్ ఇంజ‌నీర్ సురేష్‌, ఎస్‌.ఇ అశ్విన్‌కుమార్‌, న్యాక్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

ఈ నెల 27 న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఈ నెల 27 నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపింది.ఈ నెల 26న బిఎసి సమావేశం నిర్వహించి, ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే విషయంపై చర్చ జరపాలనే విషయం చర్చించనున్నారు. నెల రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి బిఎసిలో ప్రతిపాదించాలని, 15 నుంచి 20 రోజుల పాటు పనిదినాలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేయాలని అధికార పక్షం నుంచి కోరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రతిపాదనను అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నర్సింహచార్యులుకు పంపించారు. శాసనసభ ఎన్ని రోజులు జరిగితే, శాసన మండలి కూడా అన్ని రోజులు జరపాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. శాసనసభలో చర్చ జరిగిన ప్రతీ అంశపైనా మండలిలో కూడా చర్చ జరగాలన్నారు. 
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రగతి భవన్లో మంగళవారం వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రులు టి.హరీష్ రావు, కెటి రామారావు, ఈటెల రాజెందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహరెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, శాసనమండలి చీప్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, విప్ లు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి,  శాసనసభ విప్ లు గంప గోవర్థన్, గొంగిడి సునిత, నల్లాల ఓదేలు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎండిసి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలపై కూలంకశంగా చర్చ జరగాలని చెప్పారు. 

‘‘అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలి. సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశంపై జవాబు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ  అంశంపైనైనా చర్చకు సిద్ధం. ప్రజలకు అన్ని విషయాలను అసెంబ్లీ ద్వారా వివరించాలి. దీనికోసం మంత్రులు సిద్దం కావాలి. ప్రతిపక్ష సభ్యులు ఏ అంశంపై ఏ ప్రశ్నలు వేసినా ప్రభుత్వం నుంచి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల కోసం దేశంలో మరెక్కడా అమలు చేయని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వాటి గురించి వివరించాలి. సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలి. విలువైన సూచనలు స్వీకరించాలి. అంతిమంగా అసెంబ్లీ నుంచి ప్రజలకు కావాల్సిన సమాచారం పోవాలి. ఎన్ని రోజులు సభ నిర్వహించినా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నెల రోజుల పాటు సభ నిర్వహించాలని అధికార పక్షం నుంచి కోరుదాం. ప్రతిపక్ష సభ్యులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నిర్వహించడానికి మనకేమీ అభ్యంతరం లేదు. ఎవరు ఏ అంశాన్ని తీసుకున్నా మనకు అభ్యంతరం లేదు. అన్ని విషయాలపై మనం సిద్ధంగా ఉన్నాం. సభ హుందాగా నడవాలి. ప్రతీ అంశంపై చర్చ జరగాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 
మాతృభాష పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలనే నిబంధన వల్ల మాతృభాష పరిరక్షణ జరగడంతో పాటు అనేక మంది తెలుగు పండిట్లకు ఉద్యోగావకాశం కూడా లభిస్తుందన్నారు. ప్రభుత్వం స్థాపించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలపై కూడా సభలో చర్చ జరగాలని సిఎం చెప్పారు. 
‘‘ఈ సమావేశాలు చాలా ముఖ్యమైనవిగా భావించాలి. ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై మంత్రులు స్పష్టమైన ప్రకటనలు చేయాలి. వివిధ అంశాలపై సభ్యులందరూ మాట్లాడే విధంగా కూలంకశంగా చర్చ జరగాలి. కొన్ని బిల్లులు కూడా ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాలి. తెలంగాణ అసెంబ్లీ గతంలో అనేక అంశాలపై తీర్మానాలు చేసి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం నుంచి స్పందన రాలేదు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్, హైకోర్టు విభజన, ఎస్టీలకు, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, ఉపాధి హామీ పనులను వ్యవసాయంతో అనుసంధానం చేయడం, తెలంగాణలో ఎయిమ్స్ స్థాపన తదితర అంశాలపై కేంద్రాన్ని కోరుతూ మరోసారి అసెంబ్లీ గట్టిగా కోరాల్సిన అవసరం ఉంది. మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపి, వత్తిడీ పెంచాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

అసెంబ్లీ సమావేశాల కోసమేనా సీఎం సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మంత్రులు, వివిద జిల్లాల ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. అందుకు సంభందించిన తేధీలను ఈ సమావేశంలోనే ఖరారు చేసే అవకాశం ఉంది. దీపావళి తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉందనేది ప్రభుత్వ వర్గాల సమాచారం. 
 

ఎపి లో మరో విద్యార్థి ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.స్కూల్లో ఉపాద్యాముడు మందలించాడని వినుకొండకు చెందిన జావేద్(15) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.  వినుకొండ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.  తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది.  

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం ( 4 వీడియో)
 

విజయవాడ బందర్ రోడ్ లో బారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రెడీమేడ్ బట్టల దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి షాప్ మొత్తం వ్యాపించాయి. ఈ అగ్నికి  దుకాణం లోని వస్త్రాలతో పాటు ఫర్నిచర్ దగ్ధమయ్యింది. మంటలు చెలరేగినపుడు షాప్ లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ అగ్నికిలల కారణంగా షాప్ సమీపంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్నిప్రమాదం పై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
 

loader