విశేష వార్తలు గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడి లైట్ల ఏర్పాటుపై జూపల్లి సమీక్ష రాష్ట్రపతి నిబందనల మార్పు పై ఉన్నతస్థాయి సమావేశం టపాసులపై హైదరాబాద్ లోను ఆంక్షలు కర్నూల్ జిల్లాలో కరెంట్ షాక్ తగిలి నలుగురి మృతి తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు
వర్షం కారణంగా మూడో టీ 20 రద్దు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టీ20 మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. గురువారం రాత్రి భారీగా వర్షం పడటంతో ఉప్పల్ పిచ్ తడిసి చిత్తడిగా మారింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి ఫ్యాన్లు పెట్టి, పొడిమట్టి పోసి ఆటకు గ్రౌండ్ రెడీ చేయాలనుకున్న స్టేడియం సిబ్బంది ప్రయత్నాలు ఫలించలేదు.. సాయంత్రం ఆట మొదలయ్యే సమయానికి కూడా పిచ్ ఆటకు అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు.
బాలల హక్కులను కాలరాసిన ఉప్పల్ పోలీసులు
మైనర్ బాలుడికి బేడీలు వేసి స్టేషన్ కు తరలించిన పోలీసుల నిర్వాకం ఉప్పల్ లో బయటపడింది. ఓ దొంగతనం కేసులో అనుమానితుడైన ఓ మైనర్ బాలుడికి బేడీలు వేసి ఉప్పల్ పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు.
దీనిపై స్పందించిన బాలల హక్కుల సంఘం ఇందుకు భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగత్ కు ఫిర్యాదు చేసింది. మైనర్లకు బేడీలు వేయడం అంటే అది బాలల హక్కులకు విఘాతం కల్గించడమేనని, అంతేకాకుండా ఎట్టి పరిస్థితితుల్లో పిల్లల కు బేడీలు వేయరాదన్న సుప్రీ కోర్టు ఆదేశాలను దిక్కరించడమే అవుతుందని పేర్కొంది. ఇందుకు బాధ్యులైన అధికారులను వెంటనే అరెస్టు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.
యుద్ద ప్రాతిపదికన నల్లగొండ, సూర్యాపేటల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ హామీ మేరకు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎంసిఐకి పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి ని ఆదేశించారు. మెడికల్ కాలేజీల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఆజ్ఞాపించారు. సాధ్యమైనంత వేగంగా ఈ మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగే విధంగా చర్యలు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.
అలాగే ఇప్పటి వరకు ప్రగతిలో ఉన్న వైద్యశాలల భవనాలు, కొత్తగా నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణాలు, పరికరాలు, సదుపాయాల మీద కూడా మంత్రి సంబంధిత అధికారులతో చర్చించారు.
సూర్యాపేటలో కేసీఆర్ ఇలా హెలికాప్టర్ దిగిర్రు (వీడియో)
ముఖ్యమంత్రి కేసిఆర్ గురువారం సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ హైదరాబాద్ నుండి బయలుదేరి సూర్యాపేటకు చేరుకున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని జిల్లా నేతలంతా హెలి ప్యాడ్ వద్దకు వచ్చి సీఎం కు సాదర స్వాగతం పలికారు. కేసీఆర్ ను, ఆయన వచ్చిన హెలికాప్టర్ ను చూడటానికి హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలకు భారీగా ప్రజలు చేరుకున్నారు.
అక్కడినుంచి సీఎం నేరుగా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై ఆ తర్వాత జరిగిన ప్రగతి సభలో ప్రసంగించారు.
ఆన్‌లైన్ ద్వారా ఆపరేట్ చేసే లైటింగ్ వ్యవస్థ
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడి లైటింగ్ వ్యవస్థ ను ఏర్పాటు చేయనున్నట్లు, ఈ వ్యవస్థను ఆన్‌లైన్ ద్వారా కూడా ఆపరేట్ చేసేలా టెక్నాలజీని ఉపచోగిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వచ్చే సంవత్సరం మార్చి31 నాటికి ప్రతి గ్రామంలో ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవాళ రాజేంద్ర నగర్ టీ సిపార్డ్ లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ఎల్ఈడి వీధి దీపాల ఏర్పాటు పై మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ ప్రసాద్ లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషిఎన్సీ లిమిటెడ్ భరిస్తుందని తెలిపారు. ఎల్ఈడీ వీధి దీపాలు కావాలనుకుంటే గ్రామపంచాయతీ తీర్మానం అవసరమని అన్నారు. గ్రామాల్లో వెలుగులు పంచేందుకు ఈ ఎల్ఈడీ లైట్ల ఏర్పాటును పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నామని జూపల్లి తెలిపారు.
సీఎం చంద్రబాబుకు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య
కృష్ణా జిల్లా మైలవరం లో ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అయితే అతడు రాసిన సూసైడ్ లెటర్ పోలీసులకు దొరికింది. దీంట్లో మృతుడు తన కుటుంబానికి ఏం జరిగినా దానికి బొమ్మారెడ్డి శంకర్ రెడ్డి గుంటూరు ఏఅర్ డీఎస్పీ మరియు మంగళగిరి సిఐ లో కారణమంటూ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఏపి సీఎం చంద్రబాబు కి తెలుపుతున్నట్లుగా సూసైడ్ నోట్ లో రాశాడు.
అలాగే ఈ లేఖ కాపీలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు, ఎక్స్ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబుకు, గుంటూరు జిల్లా కలెక్టర్ కు, సబ్ కలెక్టర్ కు, మంగళగిరి ఎస్పీకి,సర్కిల్ ఇన్స్పెక్టర్ కి,సబ్ ఇన్స్పెక్టర్ కి ఎం.ఆర్.ఓ కి అందజేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నాడు.
జయ్ షా అవినీతిపై కోర్టును ఆశ్రయించండి : అమిత్ షా
తన తనయుడిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మొదటిసారి బిజెపి అద్యక్షుడు అమిత్ షా స్పందించారు. జయ్ షా కు సంభందించిన కంపెనీలో అవినీతి జరిగిందంటున్న ప్రతిపక్షాలు, ఆ ఆధారాలతో కోర్టును ఆశ్రయించవచ్చని దానిపై తనకేమి అభ్యంతరం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. అసలు అవినీతే జరగకుండా ఆధారాలెలా ఉంటాయని, అవే ఉంటే వారు ఇప్పటివరకు ఆగేవారు కాదని అమిత్ షా అన్నారు. ఇలా తనపైనా, ప్రదాని మోదీ పైన నిరాధార ఆరోపణలతో బురద చల్లడం తగదని ప్రతిపక్షాలకు సూచించారు.
తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు
తెలంగాణ లో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ విధానం, స్థానికతను నిర్వచించడం, రాష్ట్రపతి నిబంధనల సవరణ కోసం ఇవాళ సమావేశం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సూచనల మేరకు కొత్త జిల్లాల్లోని స్థానికులకు ఇబ్బందులు కలగకుండా మల్టీ జోనల్, జోనల్, జిల్లా స్థాయి పోస్టుల విభజన ఎలా జరగాలన్న దానిపై అధికారుల నుంచి ప్రాథమిక సమాచారం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించి వారి అభిప్రాయాలను తీసుకుంటామని అన్నారు. ఈ నెల 21వ తేదీన మరోసారి సమావేశమవుతున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా రాష్ట్రపతి నిబంధనలకు సంబంధించిన ఈ ఉన్నత స్థాయి కమిటీ తన ప్రతిపాదనలు సిద్ధం చేసి సిఎం కేసిఆర్ కు అందజేస్తుందని కడియం హామీ ఇచ్చారు.
యూత్ కాంగ్రెస్ ఆద్వర్యంలో ధర్నా
రాష్ట్రంలో సామాజికంగానే కాకుండా విద్యాపరంగా వెనుకబడిన నారాయణఖేడ్ ప్రాంతంలో పిజి కళాశాలను ఏర్నాటుచేయాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణం లోని రాజీవ్ చౌక్ వద్ద రాస్తారోకోకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
ఒక్క పిజి కళాశాలనే కాదు, నారాయణఖేడ్ ఉపఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, డిఎస్సి వేయకపోవడంతో మరణించిన రామకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ పర్యాటకంలో కొత్త ఎట్రాక్షన్
ఎకో టూరిజం విస్తరణలో భాగంగా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో కొత్త పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. అటవీశాఖ అధికారుల చొరవతో నల్లమల్ల అటవీ అందాలు, కృష్ణా తీర సొగసులు, లోయల అందాలను తిలకించేందుకు వీలుగా ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఏర్పాటైంది. ఇక్కడి నుంచి చూస్తే కృష్ణా నది ఆక్టోపస్ లా మెలికలు తిరిగి కనిపిస్తున్నందున ఆ పేరు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ - శ్రీశైలం హైవే మార్గంలో మన్ననూర్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో దోమలపెంటకు ఐదు కిలోమీటర్ల ముందు ఈ వ్యూ పాయింట్ ను ఏర్పాటు చేశారు. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎం.సి. పర్గెయిన్ దీన్ని ప్రారంభించారు. అటవీ, కృష్ణా అందాలు ఒకేసారి చూసేలా వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ పాయింట్... మరింత మంది పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను ఆకర్శిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సందర్శకులు సేదతీరేందుకు వీలుగా బెంచీలు, గుడిసె, పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని అందించడం కోసం ఒక వాచ్ టవర్ , ఫారెస్ట్ ట్రయల్ అభివృద్ధి చేస్తున్నట్లు పర్గెయన్ తెలిపారు. వ్యూ పాయింట్ సందర్శనకు వచ్చే పర్యాటకులు పరిశుభ్రత, అటవీ ప్రాంత ప్రశాంతతను కాపాడాలని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు వాడటం, విసిరేయటం చేయొద్దని సూచించారు.
'' టపాసులు కాలిస్తే కఠిన చర్యలే''
దీపావళి సందర్భంగా కాల్చే టపాసులపై హైదరాబాద్ కమిషన రేట్ పరిధిలో మూడు రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్టు సీపీ మహేందర్ రెడ్డి ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నెల 17 నుంచి 20 వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణాసంచా పేలుళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ను అనుసరించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సీపి పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(వీడియో)
సూర్యాపేట జాతీయ రహదారి పై కెటి అన్నారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.సూర్యాపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డిసిఎం వెనుకవైపు నుంచి ఓ బైక్ ను డీ కొట్టడంతొ బైక్ పై వెళుతన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ వల్ల బైక్ లో మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమయింది.
గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ యువకులు ఖమ్మం జిల్లా వాసులుగా సమాచారం.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లాలో విషాదం
కర్నూల్ జిల్లా సంజాముల మండలం మిక్కిలినేని గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అడవిపందుల కోసం ఏర్పాటుచేసిన కరెంట్ తీగలు తగిలి నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే క్రిష్ణా రెడ్డి అనే వ్యక్తి పంటను అడవిపందులు ద్వంసం చేస్తున్నాయని పొలం చుట్టూ కరెంట్ తీగలు అమర్చాడు. అయితే ఈ విషయం తెలియని శంకరయ్య, ముద్దమ్మ, ప్రవల్లిక,మియా,సుధాకర్,రజితలు కూలీ పనికోసం ఆయన పొలం దగ్గరి నుంచి వెలుతుండగా కరెంట్ తీగలు తగిలి షాక్ కు గురయ్యారు. దీంతో వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు
ఇటీవల కునుస్తున్న భారీ వర్షాలతో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో అక్క గార్ల గుడి వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో అక్కడ భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే బండరాళ్లు రోడ్డుపైన పడటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై వెంటనే స్పందించిన టిటిడి అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు
కంచ ఐలయ్య అభిమానులకు శుభవార్త
కంచె ఐలయ్య రాసిన ''కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు'' అనే పుస్తకాన్ని నిషేదించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పుస్తకాన్ని నిషేదించడం అంటే భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్లేనని, దానికి తాము సమ్మతంగా లేమని పేర్కొన్న న్యాయస్థానం పుస్తకాన్ని నిషేదించడాన్ని వ్యతిరేకిచింది. రచయితలకు చట్టాలకు లోబడి స్వేచ్చగా రచనలు చేయడానికి, భావాలను వ్యక్త పర్చడానికి అన్ని హక్కులు ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. వారి హక్కులకు భంగం కలింగించేలా తాము నిర్ణయాలు తీసుకోలేమని అన్నారు.
పుస్తక శీర్షిక, అందులోని అంశాలు ప్రజల్లో అలజడి సృష్టించేలా ఉన్నాయని వీరాంజనేయులు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషనర్ దాఖలు చేశారు. దానిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ నిర్వహణలో సదర్ ఉత్సవాలు
యాదవులు ఎంతో వైభవంగా జరుపుకునే సదర్ పండగ రోజున ప్రభుత్వం తరుపున ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21 న నారాయణగూడ లో ఈ ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు వివరించారు.
ఇవాళ మంత్రి సదర్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సచివాలయంలో సమీక్ష ను నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయం తో ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి,,
అనంతపురం జిల్లా గుంతకల్లు లో ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థుల వేదింపులను తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెలితే గుంతకల్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నందిని అనే యువతి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే గత కొంత కాలంగా ఆమె కాలేజీకి వెళ్లే దారిలోను, కాలేజీలోను కొందరు ఆకతాయీలు వేదిస్తున్నారు. అదే విదంగా ఇవాళ కూడా కాలేజిలో కొందరు సీనియర్ విద్యార్థులు ర్యాంగిగ్, ప్రేమ పేరుతో వేదింయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన నందిని కాలేజిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ లేదా అనంతపురం ఆస్పత్రికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తెలంగాణ లో మరో పరిపాలన సంస్కరణ
తెలంగాణ లో జిల్లాల విభజన తో పరిపాలన సంస్కరణలు మొదలుపెట్టిన సర్కారు, మరో కొత్త సంస్కరణను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
గత సంవత్సరం ఏర్పాటుచేసిన జిల్లాలను అనుసంధానం చేస్తూ త్వరలోనే రెవెన్యూ రేంజ్ లను ఏర్పాటు చేయడానికి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేసి ముఖ్యమంత్రి అనుమతికి పంపినట్లు, ఆయన ఆమోదముద్ర వేయగానే దీన్ని అమలుచేయనున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ ను మినహాయించి ప్రతి 3 జిల్లాలకో రెవెన్యూ రేంజ్ ను ఏర్పాటు చేసి, దీనికి ఓ మెంటర్ ను నియమించనున్నారు. ఈ మెంటర్లు గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల స్థాయి అధికారులను నియమించనున్నారు. దీన్ని త్వరలో అమలులోకి తేనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
మరో కార్పోరేట్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య (వీడియో)
కృష్ణా జిల్లా నిడమనూరులో చైతన్య కాలేజీ లో విషాదం చోటుచేసుకుంది. చైతన్య కాలేజిలో లో ఫస్ట్ ఇయర్ ఎంపిసి చదువుతున్న కడప జిల్లా రాయచోటికి చెందిన భార్గవ రెడ్డి అనే విద్యార్థి కాలేజీ హాస్టల్ లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఆత్మహత్య విషయాన్ని బయటకు పొక్కనీయకుండా యజమన్యం మృతదేహన్ని బయటకు తరలించారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల విద్యార్థులపై వివిధ కారణాలతో కార్పోరేట్ కళాశాలలు ఒత్తిడి పెంచి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న నేపథ్యంలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.