బోసిపోతున్న భాగ్యనగరం

హైదరాబాద్ : దసరా పండగ సందర్బంగా జనాలు సొంతూళ్ల దారి పట్టడంతో హైదరాబాద్ రోడ్లు బోసిపోతున్నాయి. అటు కూకట్ పల్లి నుంచి ఎల్బీ నగర్ వరకు ఎప్పుడూ రద్దిగా ఉండే రోడ్లు, ప్లై ఓవర్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలే దర్శనమిస్తున్నాయి. రేపటినుంచి వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు కుటుంబాలతో సహా ఊరిబాట పట్టారు. 
దీంతో బస్సులు. రైళ్లు కిక్కిరిసిరి పోతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు ఇప్పటికే టికెట్ ధరలు అమాంతం పెంచేసాయి.  
 ఇప్పటివరకు ఏకంగా 12 లక్షలు మంది హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు  వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే రేపటి నుంచి ఉద్యోగులకు కూడా సెలవులు ఉండటంతో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. మొత్తంగా వరుస సెలవులతో నగరం మొత్తం ఖాళీ అవుతోందన్నమాట.
 

సద్దుల బతుకమ్మ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

 సద్దుల బతుకమ్మ సందర్బంగా హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి  రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అలాగే ట్యాంక్ బండ్ పై జరిగే బతుకమ్మ వేడుకలకు విచ్చేసేవారు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలపి ట్రాఫిక్ పోలీసులకు సహరరించాలని కోరారు.  ఈ సంబరాల కోసం వచ్చే వీఐపీలు, వివిఐపీలు, మీడియా వాహనాల కోసం ధోభీ ఘాట్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి ఒక్కరు శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరించి, ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపి ప్రజలకు సూచించారు.
 

చంద్రబాబు, రాజమౌళిల లండన్ పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  మరియు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి లండన్ పర్యటనకు షెడ్యూల్ ఖరారయింది. అక్టోబర్ 24,25 తేధీల్లో అమరావతి నిర్మాణం కోసం నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో వారు సమావేశమవనున్నారు. నిర్మాణాలకు సంభందించి తుది డిజైన్లను ఈ పర్యటనలోనే  సీఎంకు ఈ సంస్థ ప్రతినిధులు అందించనున్నారు.  అలాగే ఈ ఆకృతులపై జరిగే వర్క్ షాఫ్ లో రాజమౌళి పాల్గొంటారు.  
 

టీఆర్ఎస్ ప్రభుత్వ అంతు చూస్తాం

తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందని, 2019 లో తాము అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వ అక్రమాలను బయటపెడతామని టీపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టులను ఖండించిన ఉత్తమ్ మెట్రో ఆలస్యానికి సీఎం కేసిఆరె కారణమని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వీరి అవినీతి భాగోతాన్ని బయటపెడతామని హెచ్చరించారు. 

ఎరుకల విద్యార్థుల కోసం జిల్లాకో ఏకలవ్య విద్యాలయం 

హైదరాబాద్ : ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎరుకల కులస్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని ఆ కుల సంఘం నేతలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి విన్నవించారు.  అలాగే ఎరుకుల కులస్తులకు కూడా హైదరాబాద్ లో ఓ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరారు. 
వీరి విన్నపాల పట్ల స్పందించిన కడియం ఎరుకల విద్యార్థుల విద్యాభివృద్ధికి ఏకలవ్య ఎరుకుల విద్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు. పది జిల్లాలను ప్రామాణికంగా తీసుకుని జిల్లాకొక ఏకలవ్య ఎరుకుల విద్యాలయాలకు కృషి చేస్తామన్నారు. ఎరుకుల కులవృత్తిగా కొనసాగుతున్న పందుల పెంపకాన్ని ప్రభుత్వం తరపున మరింత ప్రోత్సహించే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

పోలీస్ శాఖలో త్వరలో 26,000  ఉద్యోగాల భర్తీ

పోలీస్ శాఖలో  26,000 సిబ్బంది భర్తీకి త్వరలో నియామకాలు చేపట్టనున్నట్లు తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ వెల్లడించారు. ఇందులో తప్పనిసరిగా 8,000 మంది మహిళ సిబ్బంది ఉండేలా చర్యలు తీసకుంటున్నట్లు తెలిపారు. అంటే ప్రతి నియామక ప్రక్రియలో 33 % మహిళలకు కేటాయించేలా   చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇవాళ డిజిపి పెద్దపల్లి లో పర్యటించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కమీషనరేట్ అధునాతన భవన నిర్మాణం త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులంటే ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ప్రెండ్లీ పోలీస్ ను ఏర్పాటు చేశామని డిజిపి అన్నారు.
 

సరస్వతి దేవి అవతారంలో కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం సంధర్బంగా అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్ లలో భారులు తీరారు.

  ఇవాళ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా అమ్మవారికని దర్శించుకుని, పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం రాక సంధర్బంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం తో పాటు మంత్రులు మాణిక్యాలరావు, దేవినేని ఉమలు కూడా అమ్మవారికి దర్శించుకున్నారు.