నేటి విశేష వార్తలు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి   సెప్టెంబర్ 9 న వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం తిరుపతికి చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 3 వ తేదిన కేంద్ర కేబినెట్ విస్తరణ కార్యక్రమం కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో భేటీ అయిన  టి కాంగ్రెస్ బృందం

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

తిరుపతి: రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించిన ఆయన తొలుత ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

సెప్టెంబర్ 9న ఏపి మంత్రి మండలి భేటీ 

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 9 న వెలగపూడి సచివాలయంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆ రోజు ఉదయం 10.30 గంటలకు లకు మంత్రి మండలి భేటీ అవుతుంది. నంద్యాల అసెంబ్లీ, ఉప ఎన్నిక, కాకినాడ నగరపాలకసంస్ధ ఎన్నికల నేపధ్యంలో ప్రతి పదిహేను రోజులకొకసారి జరిగే మంత్రివర్గ సమావేశం ఈసారి ఆలస్యంగా జరుగుతోంది.

ఏపీ లో సీనియర్ ఐపీఎస్ ల బదిలీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. విశాఖ ఐజీ శ్రీకుమార్‌ విశ్వజిత్‌ ఆర్డినేషన్‌ ఐజీగా బదిలీ అయ్యారు. అడిషనల్‌ డీజీపీ అంజనా సిన్హాను బదిలీ చేసినప్పటికి, పోస్టింగ్ ఖరారు చేయలేదు. బెటాలియన్‌ లో పనిచేస్తున్న కె. కోటేశ్వరరావును ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా నియమించారు. అలాగే వెయిలింగ్ లిస్ట్ లో వున్న శ్రీధర్‌రావుకు ఐజీగా నియమించారు. 

రైల్వే పోలీసుల తనిఖీలో పట్టబడ్డ బంగారం 

విజయవాడ రైల్వేస్టేషన్ లో భారీగా బంగారం పట్టుబడింది. నెల్లూరు నుంచి హౌరా కు తరలిస్తున్న 13 కిలోల బంగారాన్ని విజయవాడలో పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు బంగారాన్ని ఐటీ శాఖకు అప్పడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్రపతికి పౌరసన్మానం 

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించింది. తిరుపతిలోని యస్వీ ఆర్ట్స్ కాలేజి ప్రాంగణంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతికి సన్మాన పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందించారు.అనంతరం రాష్ట్రపతి అంబేద్కర్ నైపుణ్యాభివృద్ధి అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

భారత ఎన్నికల కమీషనర్ గా సునీల్ ఆరోరా నియామకం

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా సునీల్ ఆరోరా నియమితులయ్యారు. ఆయన ఇవాళ పదవీ భాద్యతలు చేపట్టారు. ఇంతకు ముందు కమీషనర్ గా వున్న అచల్ కుమార్ జోతి చీఫ్ ఎలక్షన్ గా నియమింపబడటంతో, ఆయన స్థానంలో సునీల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగిన బండారు దత్తాత్రేయ

కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్వాసన పలికారు. ఆయనకు గవర్నర్ పదవి ఇస్తామని బిజేపి పెద్దలు హామీ ఇచ్చి, ప్రస్తుతం మంత్రి పదవినుంచి వైదొలగాలని ఆదేశించినట్లు సమాచారం. ఇవాళ పలువురు మంత్రులు ప్రధాని మోదీకి కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నిర్మలా సీతారామన్, బండారు దత్తాత్రేయలు కూడా వున్నారు. 

తిరుపతికి చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతి కి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర పతికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిటిడి ఈవో సింఘాల్ లు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనార్థం తిరుచానూరు బయలుదేరారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. ఈ నెల 3 వ తేదీ ఆదివారం రోజున విస్తరణ కార్యక్రమం వుండే అవకాశాలున్నాయి. అయితే ఈ విస్తరణలో భారీగా మార్పులు, చేర్పులు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇప్పటికే నిర్మలా సీతారామన్, కల్ రాజ్ మిశ్రా,ఉమాభారతి ,రాజీవ్ ప్రతాప్ లు వారి మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వారికి పార్టీ పదవులు అప్పగించేందుకు బీజేపి పెద్దలు మొగ్గుచూపుతున్నారు. అలాగే అశోక గజపతిరాజు, ఫీయుష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ లు నిర్వర్తిస్తున్న శాఖలలో మర్పులు వుండే అవకాశం వుంది. ఇటీవల రైల్వే ప్రమాదాలు ఎక్కువైన నేపథ్యంలో ప్రస్తుతం ఆ శాఖను చూస్తున్న సురేష్ ప్రభు స్థానంలో ప్రకాశ్ జవదేకర్ ను నియమించే అవకాశాలున్నట్లు సమాచారం.

బక్రీద్ సందర్భంగా రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌: సెప్టెంబర్ 2 న బక్రీద్ పండగ సంధర్బంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపి మహేందర్ రెడ్డి తెలిపారు. మిరాలం ట్యాంక్ ఈద్గా, బాలంరాయ్‌ ఈద్గా, సికింద్రాబాద్‌ ఈద్గాల ల వద్ద ముస్లింలు ప్రార్థన కోసం భారీగా హాజరుకానున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ఈ ఆంక్షలు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు.

కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో టి కాంగ్రెస్ సభ్యుల భేటీ (వీడియో)

టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కూడిన కాంగ్రెస్ సభ్యుల బృందం ఇవాళ బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ద రామయ్య భేటీ అయ్యారు. పాలమూరు జిల్లాకు నీటి అవసరాలు తీర్చే జూరాల జలశయానికి కర్ణాటక లోని నారాయణపూర్ జలాశయం నుంచి 7 టీఎంపీల నీటిని విడుదల చేయాలని ఆయనను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి నీటి విడుతలపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకు సిద్ద రామయ్యకు కాంగ్రెస్ బృందం ధన్యవాదాలు తెలిపింది.

మల్లన్న సన్నిధిలో భక్తుల ఆందోళన (వీడియో) 

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ దేవాలయం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం లో నాణ్యత లేనీ ప్రసాదాన్ని విక్రయిస్తున్నారని భక్తులు ఆందోళన నిర్వహించారు. బూజు పట్టిన లడ్డూలను, మూడు నాలుగు రొజుల నుండి నిల్వవుంచిన పులిహొర ప్రసాదాన్ని దేవాలయం ప్రసాద కౌంటర్ లో విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, అందువల్లే ఆందోళనకు దిగామని భక్తులు తెలిపారు. వీరికి స్థానిక సిపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. 

అవినీతి అధికారులకు నిర్బంధ పదవీ విరమణ

అవినీతి అధికారుల భరతం పట్టడానికి మద్యప్రదేశ్ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వాధికారుల చేత నిర్బందంగా పదవీ విరమణ చేయించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సంగ్ చౌహాన్ కలెక్టర్ లకు ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వాధికారుల ఆర్థిక వివరాలతో పాటు ఆస్తుల వివరాలు సేకరించాలని కలెక్టర్ లకు సూచించారు. రాష్ట్రంలో అవినీతి పాలనను అంతం చేయడానికి సహకరించాలని వారిని శివరాజ్ సింగ్ కోరారు.

కాకినాడ కార్పొరేషన్ లో టీడిపి ఘన విజయం

కాకినాడ కార్పోరేషన్ ను టీడిపి కైవసం చేసుకుంది. మొత్తం 46 డివిజన్లకు గాను 32 డివిజన్ల లో అధికార పక్షం ఘన విజయం సాధించింది. ఇక ప్రతిపక్ష వైసీపి పార్టీ 10 స్థానాలతో రెండవ స్థానానికే పరిమితమైంది. మిగతా డివిజన్లలో బీజేపి 3, ఇండిపెండెంట్లు 3 చోట్ల గెలుపొందారు. సైకిల్ కాకినాడలో దూసుకుపోవడంతో ఇటు స్థానికంగాను,అటు రాజధాని అమరావతి లోను టీడిపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 

నిర్మ‌ల్ జిల్లా లో రైతు స‌మ‌న్వ‌య స‌మితి ల ఏర్పాటు

నిర్మ‌ల్ జిల్లా ఎల్ల‌ప‌ల్లిలో రైతు స‌మ‌న్వ‌య స‌మితుల‌ను గృహ నిర్మాణ‌, దేవాదాయ శాఖ‌ మంత్రి అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సమన్వయ సమితుల ఏర్పాటు రికార్డుల ప్ర‌క్షాళ‌న ప్ర‌క్రియ‌కు ఆరంభంగా పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, అభివృద్ది కోస‌ం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమమే రైతు స‌మ‌న్వ‌య స‌మితుల ఏర్పాటు అని అభివర్ణించారు. రైతులు గుండె నిబ్బరంతో బ్రతకడానికి ఈ సమితులు ఎంతగానో ఉపయోగపడతామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

కాకినాడ కార్పొరేషన్ లో భారీ విజయం దిశగా టీడిపి

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీడిపి పార్టీ సగానికి పైగా స్థానాలు కైవసం చేసుకుని విజయం వైపు పయనిస్తోంది.ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం 42 డివిజన్ల ఫలితాలలో టీడిపి 29, వైసీపి 8, బీజెపి 3, డివిజన్లను గెలుచుకున్నాయి. మిగతా రెండు ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. దీంతో దాదాపు కాకినాడ కార్పోరేషన్ టీడిపి వశమైందనే చెప్పాలి. 30 ఏళ్ల తర్వాత కాకినాడ కార్పోరేషన్ పై టీడిపి జెండా ఎగరనుంది.

కాకినాడ కార్పొరేషన్ లోనూ టీడిపిదే ఆధిక్యం 

కాకినాడ: కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి టీడిపి ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటివరకు టీడిపి అభ్యర్థులు 8 డివిజన్లలను కైవసం చేసుకోగా,మరి కొన్ని డివిజన్లలో లీడింగ్ లో ఉన్నారు.
టీడిపి నుంచి గెలుపొందిన వారి వివరాలు చూస్తే..1వ డివిజన్‌లో పేరాబత్తుల లోవబాబు, 10వ డివిజన్‌లో దానమ్మ, 19వ డివిజన్‌లో పలివెల అనంత్‌కుమార్‌ , 16వ డివిజన్‌లో గంగాధర్‌ ,25వ డివిజన్‌లో కె.సీత , 34వ డివిజన్‌లో తహేరా ఖాతూర్‌ , 40వ డివిజన్‌లో సుంకర శివ ప్రసన్న లు గెలిచారు.
 ఇక ప్రతిపక్ష వైసీపీ విషయానికొస్తే 4వ డివిజన్‌లో పలకా సూర్యకుమారి, 22వ డివిజన్‌లో కిశోర్ కుమార్ లు విజయం సాధించారు.