బాలకార్మికులకు విముక్తి

రంగా రెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామంలోని ఇటుకల తయారి కేంద్రం పై పోలీసుల దాడులు నిర్వహించారు. ఇక్కడ పనిచేస్తున్న 10 మంది బాల కార్మికులను గుర్తించిన పోలీసులు వారికి విముక్తి కల్పించారు. అలాగే బాల కార్మికులను పని లో పెట్టుకున్న  ఇటుకల తయారీ కంపెనీ యజమానులు ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొ వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
 

పోలవరంపై గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ

పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పలు పిటీషన్ లపై జరుగుతున్న విచారణ పూర్తయ్యేంతవరకు ట్రిబ్యునల్ లో  విచారణ ను నిలిపి వేయాలని ఏపి ప్రభుత్వం  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను కోరింది. అలాగే  ప్రాజెక్టు విచారణ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తప్పించాలని వాదించింది.
దీనిపై స్పందించిన ట్రిబ్యునల్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతివాదిగా తొలగించే విషయంపై వారం రోజులలోపు అభ్యంతరాలను దాఖలు చేయాల్సిందిగా రేలా అనే స్వచ్ఛంద సంస్థను కోరింది. 
దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 11 కు వాయిదా వేసింది.

సత్తుపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం ( వీడియో)

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కేంద్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని రింగ్ సెంటర్ లో వేగంగా వెళుతున్న గ్యాస్ సిలిండర్ల లారీ టీవిఎస్ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో  టీవిఎస్ వాహనంపై వెళుతున్న నాగేశ్వరరావు  అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వేంసూరు మండలం దిద్దుపుడి గ్రామానికి చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు.
 లారీ బైక్ ను కొంత దూరం ఇడ్చుకెళ్ళటం తో బైక్ లో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో ప్రమాదం,  ఏడుగురి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేపడుతుండగా.. సొరంగమార్గంలో మట్టిపెల్లలు కూలి  ఏడుగురు యూపీ కి చెందిన కూలీలు మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్నజిల్లా ఎస్పీ విశ్వజిత్ కంభాటి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను కరీంనగర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు                        

విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో లలితానగర్ లో ఇద్దరు దొంగలు రెచ్చిపోయారు. ఒక ఇంట్లో దోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆ ఇంట్లోని మహిళపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. దీంతో ఆ మహిళ పెద్దగా కేకలు వేయడంతో దొంగలు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు అక్కడికి వచ్చి ఒకడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంకో వ్యక్తి అక్కడినుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
విశాఖలో పట్టపగలే దొంగలు దోపిడీకి ప్రయత్నించడం విశాఖలో సంచనం రేకెత్తించింది. ఈ దొంగలు స్థానికులా? లేక అంతరాష్ట్ర దొంగలా అన్నది పోలీసులు తేల్చనున్నారు. పోలీసులు ఆ దొరికిన వ్యక్తిని విచారిస్తున్నారు. అయితే ఈ దొంగతనం జరగడంతో విశాఖలో పోలీసులు అలర్ట్ అయ్యారు.                        

మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
 

గాంధీలో జూడాల ఆందోళన

రోగి బందువులు దాడి చేశారని పేర్కొంటూ గాంధీ ఆసుపత్రిలో జూడాలు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే పార్శీ గుట్టకు చెందిన వ్యక్తి ఇవాళ గాంధీ లో మరణించాడు. ఈ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువుల జూడాలపై  దాడికి దిగారు. ఈ ఘటనపట్ల ఆగ్రహించిన డాక్టర్లు అత్యవసర సేవలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని, డాక్టర్లను సముదాయించేందకు ప్రయత్నిస్తున్నారు.
 

మెక్సికోలో భారీ భూకంపం, 216 మంది మృతి

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఈ భయానక భూకంపం దాటికి 216 మంది చనిపోయినట్లు సమాచారం. ఇంకా శిధిలాల తొలగింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంపం వల్ల ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది.  పలు భవనాలు నేలమట్టం అయ్యి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.  

కన్న కూతురినే చంపిన తండ్రి

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలకేంద్రంలోని ఆర్బీనగర్ లో ధారుణం జరిగింది. ఐదు సంవత్సరాల కన్న కూతురినే హత్య చేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు అతడికి సహకరించిన రెండో భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ ఘటన పై స్పందించిన బాలల హక్కుల సంఘం నిందితులను కఠినంగా శిక్షించాలని  శంషాబాద్ డి.సి.పి పద్మజ విజ్ఞప్తి చేశారు.

చీరాల లో ప్రేమజంట ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలోని చీరాల మండలం లో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేటపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి  బత్తుల సందీప్(22),మౌనిక(22) లు ఆత్మహత్య  చేసుకున్నారు.

ఈ ప్రేమజంట చీరాల లో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. మౌనిక ది గుంటూరు జిల్లా మొదుకూరు కాగా సందీప్ నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రానికి చెందినవాడు.  

పాతబస్తీలో 8 మంది అరబ్ షేక్ ల అరెస్ట్

హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో 8 మంది అరబ్ షేక్ లు సహా వారికి సహకరిస్తున్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫలకనుమా, చాంద్రాయణగుట్ట  ప్రాంతాల్లో మైనర్ బాలికలను కాంట్రాక్ట్ పద్దతిలో పెళ్ళిళ్ళు చేసుకోడానికి ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.  అరబ్ షేక్ లకు సాయం చేస్తూ, అమ్మాయిలను సమకూరుస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 
 

మల్కాజిగిరి  కార్పొరేటరు కుమారుడి అరెస్ట్ (వీడియో)

 మల్కాజిగిరి  కార్పొరేటరు కుమారుడు అభిషేక్ గౌడ్ ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్  చేసారు. సోషల్ మీడియాలో అమ్మాయి లను అభిషేక్ వేదింపులకు గురి చేసినట్లు షీ టీం లకు మొత్తం మూడు కంప్లైంట్ వచ్చాయి. ఈ ఫిర్యాదులను విచారించిన పోలీసులు అభిషేక్ పై కేసు నమోదు చేశారు. అభిషేక్ తో పాటు మరో  ఇద్దరు అతడి స్నేహితులపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ అభిషేక్ ను  అదుపులోకి తీసుకున్నారు. అతడి స్నేహితులిద్దరు పరారీ లో ఉన్నారు.
 

ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థుల మృతి

ఉక్రెయిన్ దేశం జాపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ లో ఎమ్ బి బి ఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తు మరణించారు. హైదరాబాద్ లోని కుంట్లూరు ప్రాంతానికి చెందిన  శివకాంత్ రెడ్డి మరియు కడప కి చెందిన అశోక్ లు ఉన్నత చదువుల నిమిత్తం ఉక్రెయిన్ కు వెళ్లారు. 
వీరు ఉక్రెయిన్ లోని ఓ బీచ్ లో ప్రెండ్స్ తో కలిసి వాలీబాల్ ఆడుతుండగా, సముద్రం లోకి వెళ్లిన ముఖేష్ అనే మరో మిత్రుడిని కాపాడటానికి వెళ్లి మృత్యవాతపడ్డారు. విషయం తెలిసిన వీరి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.