మూడో రోజుకు చేరిన తెలంగాణ విద్యార్థుల మహాపాదయాత్ర

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana
Highlights

ఈ రోజు విశేషాలు

  • మూడో రోజుకు చేరిన తెలంగాణా విద్యార్థుల మహాపాదయాత్ర
  • సాంకేతిక కారణాలతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఇండిగో విమానం
  • కాళేశ్వరం రాస్తాలో బస్సు ప్రమాదం, 15 గురికి గాయాలు
  • ఇంకా ఎన్నో...

కోయంబత్తూరు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి

తమిళనాడులోని కోయంబత్తూర్ ఘోర ప్రమాదం జరిగింది. కోమంబత్తూరులోని సోమనూరు ప్రాంతంలో బస్టాండ్ భవనం కూలి 10 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. సుమారు 30 మంది వరకు తీవ్రంగా గాయపడగా వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా శిథిలాల కింద క్షతగాత్రులు వుండే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. అందుకోసం సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.  
 

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దళితుల ఆందోళన 

విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మేల్యే నారాయణస్వామి నాయుడు కి వ్యతిరేకంగా పూసపాటి రేగ మండలంలోని దళితులు ఆందోళన చేపట్టారు. గతంలో తమకు కేటాయించిన భూములను ఎమ్మెల్యే తన పలుకుబడిని ఉపయోగించి అక్రమంగా ఆక్రమించాడని వారు వాపోయారు. ఎమ్మెల్యేకు చెందిన ఎస్‌వీస్‌ కెమికల్స్‌ కంపెనీ కోసం ప్రభుత్వం ఈ భూములను  కేటాయించడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన  వ్యక్తం చేశారు.  
వీరి ఆందోళనకు పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  

తెలంగాణ డిఎస్ సి మహా పాదయాత్ర, మూడో రోజు విశేషం

మెగా డిఎస్ సి నిర్వహించాలని తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల మహా పాదయాత్ర నేడు మూడో రోజున  నాథ్ పల్లి నుండి ప్రారంభమయింది. అక్కడ  విద్యార్థులు, నిరుద్యోగులు,యువకులు, రాజకీయ నాయకులు ఘనంగా నీరాజనం పలికారు. ఈ పాదయాత్ర జనగామ వూపు సాగుతూ ఉంది. ఈ యాత్ర సెప్టెంబర్ 5న వరంగల్ కాకతీయ యూనిర్శిటీ నుంచి మొదలయింది. ఉద్యమాల నెలవు ఉస్మానికి యూనివర్శిటీ దాకా సాగుతుంది. తెలంగాణా లో ఖాళీ ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ఒక మెగా డిఎస్ సి నిర్వహించాలని టీచర్ ఉద్యోగాల ఔత్సాహికులు కోరుతున్నారు. దీనికోసం రకరకాల ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మహా పాదయాత్ర ప్రారంభించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
 

సాంకేతిక కారణాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఒకటి అత్యవసర ల్యాండ్ అయ్యింది.  వివరాల్లోకి వెళితే శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి అహ్మదాబాద్ వెళ్ళుతున్న ఇండిగో విమానం 168 మంది ప్రయానికులతో బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం రావడంతో ఇరవై నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఏమైతుందో తెలీక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే చివరకు విమానాన్ని పైలట్ చాకచక్యంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

కాళేశ్వరం రాస్తాలో బస్సు ప్రమాదం, 15 గురికి గాయాలు

 

జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లిలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆర్ టిసి బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న డిసిఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. వారిని మహదేవ్ పూర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జయశంకర్ జిల్లాలో సిరొంచ‌-ఆత్మ‌కూర్ 363 జాతీయ రహదారిపై ఈ ప్ర‌మాదం జరిగింది. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా న‌ల్ల‌బెల్లి మండ‌లం శ‌నిగారం గ్రామానికి చెందిన 35 మంది డిసిఎంలో కాళేశ్వ‌రం వెళ్తున్నారు.

 

 

 

 

 

 

 

 

loader