నల్గొండ జిల్లాలో హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకే నల్గొండ మున్సిఫల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త, ఎమ్మెల్యే కోమటిరెడ్డి అనుచరుడైన బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు అధికార పార్టీతో సంబంధముందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ హత్య గురించి ఇంకా విచారణ జరుగుతుండగానే మరో కాంగ్రెస్  నాయకుడు అత్యంత దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటిబయట నిద్రిస్తున్న ఒక గ్రామ ఉపసర్పంచ్ పై గుర్తు తెలియని దుండగులు బాంబులు వేసి హత్య చేశారు.   

 
ఈ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ  జిల్లా తిర్మలగిరి మంండలం చింతలపాలెం గ్రామానికి చెందిన ధర్మానాయక్ అనే కాంగ్రెస్ నాయకుడు ఉపసర్పంచ్ గా పనిచేస్తున్నాడు. అయితే రోజూ మాదిరిగా రాత్రి తన ఇంటి బయట పడుకున్న అతడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అర్థరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో అతడు పడుకున్న మంచం కింద బాంబు పెట్టి పేల్చివేశారు. దీంతో అతడి శరీరం ముక్కలు ముక్కలై శరీర భాగాలు ఇంటి పరిసరాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి.  

అయితే ఉప సర్పంచ్ ధర్మానాయక్ హత్యతో ఆ గ్రామంలో అలజడి నెలకొంది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు పాతకక్షలే కారణమా ?  ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యప్తు చేస్తున్నారు.