ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి, వైసిపి పార్టీల మద్య రాజకీయ వైరం ఉన్న మాట అందరికీ తెలిసిందే. అయితే ఈ వైరం శవాలతో రాజకీయాలు చేసే స్థాయికి దిగజారింది. ఇటీవల కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ  వ్యక్తి మరణానికి వైసిపి పార్టీ చేపట్టిన ర్యాలీయే కారణమని అధికార టిడిపి ఆరోపిస్తోంది. దీనికి కారణమైన నాయకులపై కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది సాధారన మరణమేనని,  అతడి చావుకి తమ తప్పేమీ లేదని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబదించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.  

కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన కట్టెబోయిన రామయ్య(56) అనే వృద్దుడికి చాతీలో నొప్పిగా ఉండటంతో ఆటోలో ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే మార్గ మద్యలోనే చాతి నొప్పి ఎక్కువై వృద్దుడు చనిపోవడం జరిగింది. అయితే ఈ వృద్దుడి ప్రయాణిస్తున్న ఆటోకి వైసిపి ర్యాలీ అడ్డురావడంతోనే ఆస్పత్రికి సరైన సమయానికి వెళ్లలేక చనిపోయాడని అధికార టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగానే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీనికి బాద్యున్ని చేస్తూ వైఎస్ఆర్ సిపి మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి జోగి రమేష్ పై కేసు పెట్టించాలని టిడిపి నేతలు బావిస్తున్నారు. ఇందుకోసం మంత్రి దేవినేని ఉమ ఆదేశాలమేరకు పోలీసులు కూడా వారికే సహకరిస్తున్నట్లు వైసీపి నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ మరణానికి తమ ర్యాలీకి అసలు సంబంధమే లేదని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమ నాయకున్ని ఇరికించాలని అధికార పార్టీ కుట్రలు పన్నుతున్నారని వైసిపి చెబుతోంది. 

అయితే మృతుడు కుటుంబసభ్యులు కూడా ఇలా తమ కుటుంబాన్ని రాజకీయ పావుగా వాడుకోవద్దని అంటున్నారు.  ఒత్తిడి చేసి మరీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు, నాయకులు శవరాజకీయాలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దంటూ  వేడుకుంటున్నారు.  ఇక రామయ్యను ఆసుపత్రికి తీసుకువెలుతుండగా వైసిపి ర్యాలీ అడ్డువచ్చిందని స్టేట్ మెంట్ ఇవ్వాలని ఆటోడ్రైవర్ పై కూడా ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. అయితే డ్రైవర్ శ్యామ్ కుమార్ మాత్రం  రామయ్య ఆటోలొ వాంతి చేసుకుంటుండటంతో నిలిపానని, అదే సమయంలో అతడికి నొప్పి ఎక్కువై చనిపోయాడని చెబుతున్నాడు. తమకు ఎటువంటి ట్రాఫిక్ ఆటంకాలు ఎదురు కాలేదంటూ శ్యాం కుమార్ తెలిపాడు.