కొట్లాట సభలో రచనారెడ్డి పంచ్ డైలాగ్స్

First Published 4, Dec 2017, 7:16 PM IST
advocate Rachana Reddy dares KCR government to issue flawless job notifications
Highlights
  • ప్రభుత్వానికి ఉద్యోగ నియామకాలపై చిత్తశుద్ది లేదన్న అడ్వకేట్ రచనారెడ్డి
  • కొలువులకై కొట్లాట సభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రచన
  • యువత ఎవరికోసమో తమ ప్రాణాలు బలిచేసుకోవద్దని సూచన 

 
ప్రభుత్వంలో ఉండి విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఎక్కిళ్లు వచ్చేలా కొట్లాడాలని అడ్వకేట్ రచనా రెడ్డి తెలంగాణ విద్యార్థులను సూచించారు.  సరూర్ నగర్ లో జరుగుతున్న కొలువుల కై కొట్లాట సభలో పాల్గొన్న ఆమె యువతను ఉద్దేశించి మాట్లాడారు.

ఉద్యోగాల కోసం ఇక యువత చావాల్సిన అవసరం లేదన్నారు. మీరు తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలను అనుభవించే హక్కు మీకు మాత్రమే ఉందని విద్యార్థులకు దైర్యం చెప్పారు. కావాలని ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా నోటిఫికేషన్లు జారీ చేసి వాటి గురించి ప్రశ్నిస్తే నోటిఫికేషన్లకు అడ్డుపడుతున్నారని తమపై నింద వేస్తున్నారన్నారు. ప్రభుత్వానికే చిత్తశుద్ది ఉంటే ఎలాంటి లొసుగులు లేకుండా ఉద్యోగ ప్రకటన చేపడితే కోర్టే వాటిని స్వీకరించదన్నారు. అలాంటపుడు తాము కాదు ఎవరు అడ్డుపడ్డా నియామకాలు ఆగవని, అలాంటి నోటిపికేషన్ జారీ చేసే దమ్ము తెలంగాణ ప్రభుత్వానికి ఉందా అని ఆమె ప్రశ్నించారు.

తాము ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉద్యోగాలను అడ్డుకుంటున్నామంటున్న ప్రభుత్వానిదే ద్వంద్వ వైఖరి అని రచన ఆరోపించారు.మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి గాని ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం మంచిది కాదన్నారు. గట్టిగా ప్రయత్నించి తమ కొలువులను సాధించుకోవాలని సూచించారు. ప్రభుత్వాన్ని కొలువులు ఇస్తరా లేక చస్తరా అని ప్రశ్నించే సమయం ఆసన్నమైందన్నారు రచనా రెడ్డి.

ఆమె ప్రసంగానికి విద్యార్థుల నుంచి అశేష స్పందన లభించింది. ఆమె మాట్లాడుతున్నంత సేపు విద్యార్థుల నినాదాలు, ఈళలతో సభాస్థలం మొత్తం మారుమోగింది.

loader