ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా మహిళలను వేదిస్తున్న మృగాళ్ల సంఖ్య తగ్గడం లేదు.తాజాగా మహిళలను, యువతులను వేదిస్తున్న కొందరు ఆకతాయి యువకులకు మెడ్చల్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒకరో ఇద్దరో కాదు ఏకంగా 51 మంది. ఈ  పోకిరీలు మహిళల పట్ల అసభ్యంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే షామిర్ పేట్  పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన  యువకులు కొందరు అంగడికి వచ్చిన మహిళల పై అసభ్యకరంగా ప్రవర్తించారు. సంతకు కూరగాయల కోసం వచ్చిన   మహిళలను, యువతులను అసభ్య పదజాలంతో పిలవడం, దూషించడం తో పాటు అకృత్యాలకు పాల్పడ్డారు.అంతే కాకుండా రాత్రి సమయంలో సంతకు వచ్చిన మహిళలను వేదించడానికి కరెంటును కట్ చేసి అసభ్యంగా తాకుతూ పైసాచిక ఆనందం పొందారు. 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వేదింపులకు పాల్పడిన మొత్తం 51 మంది యువకులను గుర్తించి  పోలీస్ స్టేషన్ కు తరలించారు. తర్వాత  యువకుల తల్లిదండ్రులను పిలిపించి వారి ఎదుట కౌన్సెలింగ్ నిర్వహించి పిటి కేసు నమోదు చేసారు. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేసారు.