బరువు తగ్గాలంటే చాలా కష్టం అనుకుంటారు చాలా మంది. నిజానికి బరువు తగ్గడం మీరనుకున్నంత కష్టమేమీ కాదు. కొన్ని చిట్కాలను పాటిస్తే సులువుగా వెయిట్ లాస్ అవ్వొచ్చంటున్నారు నిపుణులు. కానీ బరువు తగ్గాలంటే కొన్ని ఆహారాలను అసలే తినకూడదు.
బరువు తగ్గడానికి ఎన్నె ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా బరువు తగ్గని వారు చాలా మందే ఉన్నారు. ఇలా తగ్గక పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బరువు పెరగనీయకుండా చేసే ఆహారాలను తినడం వల్లే బరువు ఏ మాత్రం తగ్గరని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి సలాడ్లు, పండ్లు తింటూ.. ఖాళీ కేలరీలు ఉండే ఆహారాలను తింటే మీరు ఎంత ప్రయత్నించినా.. ఇంతకూడా బరువు తగ్గరు. ఎందుకంటే ఖాళీ కేలరీల ఆహారాల్లో ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ ఆహారాలలో చక్కెర, కొవ్వుల నుంచి వచ్చే కేలరీలు వీటిలో పోషకాలను తగ్గిస్తాయి.
నిజానికి ఖాళీ కేలరీలు తక్షణ శక్తిని అందిస్తాయి. కానీ కండరాలను నిర్మించడానికి, విటమిన్లను సరఫరా చేయడానికి లేదా కడుపు నిండిన భావనను కలిగించడానికి ఉపయోగపడవు. శక్తి కోసం ఉపయోగించని ఖాళీ కేలరీలు మీ శరీరంలో కొవ్వుగా నిల్వ చేయబడతాయి. ఇంతకీ బరువు తగ్గాలనుకునేవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫాస్ట్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్
ఫ్రెష్ ఫ్రైస్ ను పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. కానీ ఉప్పుగా ఉండే ఆహారాలు మీ శరీరానికి హానీ కలిగిస్తాయి. ఎందుకంటే ఇవి ఎక్కువగా ప్రాసెస్ చేయబడతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ మొత్తమే ఉండదు. వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మీరు అతిగా ఫుడ్ ను తినే అవకాశం ఉంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది.
శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్
శీతల పానీయాలు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ ఖాళీ కేలరీల పానీయాలు మీ రక్తంలో చక్కెరను పెంచుతాయి. కేలరీలు ఎక్కువగా ఉండే ద్రవాలు ఆహారం లాగే మీ ఆకలిని తీర్చవు. కాబట్టి మీరు ఇంకా తినాని మీ మెదడు సంకేతాలను ఇస్తుంది. దీంతో మీరు మోతాదుకు మించి తినే అవకాశం ఉంది.
బేకరీ ఐటమ్స్
చాక్లెట్లు, జామ్-స్టఫ్డ్, క్రీమీ, కుకీలు, పేస్ట్రీలు, డోనట్స్, కేకులలో చక్కెర, ఉప్పు, శుద్ధి చేసిన పిండి, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ పదార్థాలన్నీ మంటను కలిగిస్తాయి. వీటిని తీసుకోవడం మానేస్తే మీరు సులువుగా బరువు తగ్గుతారు.
ఆల్కహాల్
ఆల్కహాల్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఆకలి కోరికలను ఎక్కువ చేస్తుంది కూడా. ఆల్కహాల్ గ్రాముకు ఏడు కేలరీలు కలిగి ఉంటుంది. ఇది స్వచ్ఛమైన కొవ్వుతో సమానంగా ఉంటుంది. ముఖ్యంగా ఆల్కహాల్ లో పోషక విలువలు అసలే ఉండవు. ఆల్కహాల్ ను నిర్విషీకరణ చేయడానికి మీ శరీరం మీ జీవక్రియను తగ్గిస్తుంది. ఎన్నో రకాల ఆల్కహాల్ పానీయాల్లో ముఖ్యంగా కాక్టెయిల్స్ లో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బరువును ఇంకా పెంచుతుంది.
ప్రాసెస్ చేసిన మాంసాలు
హామ్, సాసేజ్, హాట్ డాగ్స్, బేకన్ వంటి మాంసాల్లో సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ధమనులను అడ్డుకుంటుంది. అలాగే శరీరంలో మంటను కలిగిస్తుంది. ఇది మీరు బరువు తగ్గకుండా చేస్తుంది. నైట్రేట్లు ఈ మాంసాలలో కూడా ఉంటాయి. ఇవి డిఎన్ఎ నష్టాన్ని కలిగిస్తాయి. శరీరంలో మంటను కలిగిస్తాయి.
