అతిగా తిన్నా.. కదలకుండా ఒకే దగ్గర కూర్చున్నా.. వ్యాయామం చేయకపోయినా విపరీతంగా బరువు పెరిగిపోతారు. అంతేకాదు ఆడవారిలో కొన్ని హార్మోన్లు కూడా వారి బరువును పెంచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా బరువు పెరిగిపోతారంటున్నారు నిపుణులు. అధిక ఒత్తిడి లేదా శరీరంలో కార్డిసాల్ స్థాయిలు పెరగడం వల్ల కూడా బరువు పెరుగుతారు. దీన్నే హార్మోన్ల వల్ల బరువు పెరగడం అంటారు. మీ శరీరంలో కార్డిసాల్ స్థాయిలు పెరగడం వల్ల మీ శరీరంలో కొవ్వు కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జీవక్రియను నెమ్మదింపజేస్తుంది. ఈ కారణంగానే చాలా మంది ఆడవారు అకస్మత్తుగా బరువు పెరిగిపోతూ ఉంటారు. అసలు ఎలాంటి హార్మోన్లు బరువును పెంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రుతువిరతి సమయంలో ఆడవారి శరీరంలో ఎస్ట్రాడియోల్ అని పిలువబడే ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది శరీరంలో జీవక్రియ, శరీర బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. తక్కువ స్థాయి ఎస్ట్రాడియోల్ బరువు పెరగడానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ల పిరుదులు, తొడలు బాగా బరువు పెరుగుతాయి.
రుతువిరతి సమయంలో బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది
రుతువిరతి సమయంలో ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. ముఖ్యంగా హార్మోన్ల మార్పుల వల్ల వారి పిరుదులు, తొడల కంటే పొత్తి కడుపు బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇలా బరువు పెరగడానికి హార్మోన్ల మార్పులు మాత్రమే కాదు ఇతర కారణాల వల్ల కూడా బరువు పెరిగిపోతారు. సాధారణంగా బరువు పెరగడం జీవనశైలి, జన్యుపరమైన కారణాలతో పాటుగా వృద్ధాప్యంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన ఆహారాలను తినకపోవడం, మంచి నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా రుతువిరతి తర్వాత బరువు పెరగడానికి కారణమవుతుంది. కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ కేలరీలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది బరువును మరింత పెంచుతుంది.
ఎండోమెట్రియోసిస్
ఎండోమెట్రియోసిస్, బరువు పెరగడానికి మధ్య సంబంధం ఉందని ఒక పరిశోధనలో తేలింది. ఇది బరువు పెరగడం, అపానవాయువు సమస్యలకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. ఎండోమెట్రియోసిస్ ఉన్నవారు విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంది. లేదా బరువు తగ్గడం కష్టమవుతుందని పరిశోధనలో తేలింది.
పిసిఒఎస్
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ యుక్తవయస్సులో మహిళల్లో కనిపించే ఒక హార్మోన్ సమస్య. శరీరంలో చక్కెరలు, పిండి పదార్థాలను శక్తిగా మార్చడానికి ఇన్సులిన్ సహాయపడుతుంది. అయితే ఈ పిసిఒఎస్ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉపయోగించడాన్ని కష్టతరం చేస్తుంది. ఎక్కువ ఇన్సులిన్ స్థాయిలు పురుష హార్మోన్ అయిన ఆండ్రోజెన్ల ఉత్పత్తిని పెంచుతాయి. అధిక ఆండ్రోజెన్ స్థాయిలు జుట్టు పెరగడానికి , మొటిమలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బరువు పెరగడానికి కారణమవుతాయి. ఎందుకంటే బరువు పెరగడానికి మేల్ హార్మోన్ ఆండ్రోజెన్లు కారణమవుతాయి. ఇది సాధారణంగా కడుపులో సంభవిస్తుంది.
హైపోథైరాయిడిజం
థైరాయిడ్ జీవక్రియను సమతుల్యం చేస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు మెదడు, కొవ్వు కణాలు, కండరాలు, కాలేయం వంటి అనేక కణజాలాలతో ఇంటరాక్ట్ అవుతాయి. థైరాయిడ్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు జీవక్రియ మందగిస్తుంది. అలాగే శరీర శక్తి తక్కువగా ఖర్చు అవుతుంది. దీంతో కొవ్వు నిల్వలు శక్తిగా మారవు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
